Tenth Class: పరీక్షలు ప్రారంభం.. ఈ సబ్జెక్ట్‌కు ఒకే ప్రశ్నపత్రం, 2 ఆన్సర్ షీట్లు..
3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఏడు మాధ్యమాల్లో పరీక్షలు
తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్‌లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్‌లెట్లను అందిస్తారు. సైన్స్‌కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాలి.
- పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
- అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు.
- విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్‌ను సమాధానాల బుక్‌లెట్‌కు పిన్ చేయాలి.
- ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది.