Tenth Class Public Exams 2024: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లగా శ్రీకాకుళం జిల్లాను ఊరిస్తూ వస్తున్న టాప్ ర్యాంకును ఈ ఏడాది ఎలాగైనా సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్నారు.
టార్గెట్ నెంబర్ వన్ ప్లేస్..
టెన్త్ పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఒకటే టెన్షన్.. అయితే వారు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండేలా ముందు నుంచే ప్రత్యేక ప్ర ణాళికను సిద్ధం చేశారు జిల్లా విద్యాశాఖ అధికారులు. పాఠశాల విద్య ఉన్నతాధికారులు, గత కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా దిశా నిర్దేశం చేశారు. 2022లో విడుదలైన ఫలితాల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రెండోస్థానంలో నిలవగా.. జిల్లాల విభజన తర్వాత 2023లో వెలువడిన ఫలితాల్లోను శ్రీకాకుళం జిల్లా రెండోస్థానంలో నిలిచింది. దీంతో ఈ ఏడాది టార్గెట్.. నంబర్ వన్ సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి కృషి చేస్తున్నా రు. డీఈఓ ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటిరీయల్‌ను విద్యార్థులకు అందజేస్తున్నారు.
Also Read : Mathematics study material
వెనుకబడిన వారిపై ప్రత్యేక ఫోకస్
ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వ బడుల్లో ఉదయం 8.30 నుంచి 9.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని డైలీ ఆన్‌లైన్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9.15 నుంచి 4 గంటల వరకు ఉన్న సమయాన్ని రెండేసి పీరియడ్స్ చొప్పున నాలుగు సబ్జెక్టులకు కేటాయిస్తున్నారు. జనవరి 2 నుంచి మొదలైన ఈ డైలీ టెస్టులు మార్చి 15వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం 20 మార్కులకు జరిగే 130 మోడల్ టెస్టు పరీక్షలు జరుగుతాయి. రోజుకు నాలుగు సబ్జెక్టులో వారి ప్రతిభను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ, బి గ్రేడ్‌లో ఉండే తెలివైన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు లేదా ఇంటి వద్దే చదివించి మరుసటి రోజు వారితో పరీక్ష రాపించడం చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని డీసీఈబీ సెక్రటరీ గెట్డాపు రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు.
మొదటి స్థానమే లక్ష్యంగా..
శ్రీకాకుళం జిల్లా గత కొన్నేళ్లుగా పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయి రెండోస్థానంలో నిలుస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మొదటి స్థానమే లక్ష్యంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. అనేక కార్యక్రమాలను, ప్రత్యేక తరగతులను చేపడుతున్నాం. ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ ఉత్తీర్ణతను మరింత మెరుగు పడేలా ఫోకస్ చేస్తున్నాం.