సివిల్స్ అభ్యర్థులకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'అనిల్ స్వరూప్' సూచనలు..
దైనందిన ఉద్యోగ జీవితంలో ఉన్నతాధికారులకు అనేక సందిగ్ధతలు ఎదురవుతాయని, అలాంటి సందర్భాల్లో ప్రజలకు ఏది అత్యున్నత ప్రయోజనం కలిగిస్తుందో ఆ నిర్ణయాన్ని మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా చాలా ఎదురవుతుంటాయని, వాటిని సమర్థంగా ఎదుర్కోవడంలోనే అధికారుల చాకచక్యం అంతా నిరూపితం అవుతందని అనిల్ స్వరూప్ అన్నారు.
మారాల్సిన విషయం మీకు నచ్చడం మొదలైతే.. మీరు కూడా..
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేసినప్పుడు తనకు ఎదురైన వివిధ అనుభవాలను ఆయన విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారాల్సిన విషయం మీకు నచ్చడం మొదలైతే.. మీరు మారడానికి ప్రయత్నిస్తారు. మార్పును ఆహ్వానించండి. అదే మీకు విజయాలను తెచ్చి పెడుతుందన్నారు. అలాగే నేను ఉదయం ఆలస్యంగా లేచేవాడిని. న్యాయవాద విద్యలో కొన్ని అర్థమయ్యేవి కావు. నా మిత్రుడు కొంత తెల్లవారుజామునే లేవాలని చెప్పాడు.
అప్పుడు క్రికెట్ కామెంట్రీ అంటే నాకు ఇష్టం. అది తెల్లవారుజామునే వచ్చేది. అది వినడానికి నేను తెల్లవారుజామునే లేచేవాడిని. 25 రోజుల పాటు నేను ఉదయం 5.30కి లేవడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా ఉదయం 6 గంటలకే లేస్తున్నాను. అబ్బాయిలు ఉదయమే లేవాలంటే, మిమ్మల్ని 5 గంటలకే లేపే స్నేహితురాలిని ఒకరిని సిద్ధం చేసుకోండి. అమ్మాయిలైతే స్నేహితులను గుర్తించండి. ఇలా మీ అలవాట్లను మార్చుకునే మెథడాలజీ చూసుకోవాలి. సాయంత్రం ఏం చేస్తారు? పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ఏం చేస్తారు? మంచి పుస్తకాలు చదవండి. వాటితో మీ వ్యక్తిత్వం బాగా మెరుగుపడుతుందన్నారు.
ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండండిలా..
చీఫ్ మెంటార్, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. సివిల్స్ సాధించాలనుకునే విద్యార్థులు ముందుగా ఒత్తిడిని పూర్తిగా దూరం చేసుకోవాలని సూచించారు. పిల్లలు ఎంత తెలివైనవారైనా.., ఎంత సేపు కష్టపడి చదివినా, చివరి నిమిషంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమన్నారు. కేవలం సివిల్స్ ఒక్కటే కాకుండా ఇంకా క్లాట్, క్యూట్, ఎన్‌డీఏ, నిఫ్ట్, హోటల్ మేనేజ్‌మెంట్ లాంటి విభిన్న కెరీర్‌లు ఉంటాయని, వీటిలో తమకు నచ్చినది ఏంటో ఎంచుకుని దానిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.