Private Colleges Fees: ప్రైవేట్‌ ఫీజులు.. వందల్లో ఉన్న ఫీజును వేలల్లో వసూలు

కోదాడ: వార్షిక పరీక్షల ఫీజుల పేరుతో జిల్లాలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యజమానులు దందా మొదలు పెట్టారు. వందల్లో ఉన్న ఫీజును వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇంటర్నల్స్‌, ప్రాక్టికల్స్‌ అంటూ అదనంగా దండుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని, కనీసం రశీదు కూడా ఇవ్వడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

కోట్లలో ‘అధిక’ వసూళ్లు

2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరిగే వార్షిక పరీక్షల కోసం న‌వంబ‌ర్‌ 18వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 26 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో మొదటి సంవత్సరంలో 4,853 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 4,651 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న వారిలో 90 శాతం మంది సైన్స్‌ విద్యార్థులు, 10శాతం మంది ఆర్ట్స్‌ విద్యార్థులు ఉంటారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫీజు రూ.520 కాగా సైన్స్‌ విద్యార్థుల నుంచి రూ. 2,500 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కాగా ఆర్ట్స్‌ విద్యార్థుల నుంచి రూ. వెయ్యి తక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలా కేవలం మొదటి సంవత్సరం సైన్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థుల నుంచి దాదాపు రూ.91.23లక్షలు అదనంగా పిండుతున్నారు. ఇక ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫీజు 750 రూపాయలుగా ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

కానీ సైన్స్‌ విద్యార్థుల నుంచి రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్ట్స్‌ విద్యార్థులకు సైన్స్‌ విద్యార్థులకంటే వెయ్యి రూపాయలు తక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 4,651 మంది ద్వితీయ సంవత్సరం సైన్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థుల నుంచి ఇలా దాదాపు కోటిన్నర వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. వాటిల్లో మంచి మార్కులు వేయాలంటే అడిగినంత చెల్లించాల్సిందేనని చెబుతున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

రసీదు ఇవ్వడంలేదు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల నిర్వాహకులు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేస్తుండడంతో కొన్ని చోట్ల తల్లిదండ్రులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. తమకు రసీదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికి తెలివిగా కళాశాలల నిర్వాహకులు పరీక్ష ఫీజుతో పాటు ఇంటర్నల్‌ పరీక్షల ఫీజు అంటూ తాము వసూలూ చేస్తున్న మొత్తానికి కలిపి రసీదు ఇస్తున్నారు.

అధికారులకు ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే తాము పరీక్ష ఫీజు కరెక్ట్‌గానే తీసుకుంటున్నామని, మిగతాది ఇంటర్నల్‌ పరీక్షల కోసం తీసుకుంటున్నామని చెబుతూ తెలివిగా తప్పించుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అధికారులకు కూడా ఈవిషయం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఇంటర్‌బోర్డు అధికారులు పరీక్ష ఫీజుల పేరుతో చేస్తున్న దందాపై దృష్టి సారించాలని, అధికంగా వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు కోరుతున్నారు.

#Tags