Intermediate Exams: ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... ఒత్తిడికి గురికాకుండా టోల్‌ఫ్రీ నంబర్‌

వనపర్తిటౌన్‌: ఫిబ్ర‌వ‌రి 28నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌చార్జి డీఐఈఓ మద్దిలేటి వెల్లడించారు.

ఫిబ్ర‌వ‌రి 26న‌ డీఐఈఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 14 వరకు జనరల్‌, 16వ తేదీ వరకు ఒకేషనల్‌ విద్యార్థులకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మొదటి సంవత్సరం జనరల్‌లో 5,453 మంది, ఒకేషనల్‌లో 1,123 మందితో కలిపి మొత్తం 6,576 మంది విద్యార్థులు.. రెండో సంవత్సరం జనరల్‌లో 4,882 మంది, ఒకేషనల్‌లో 999 మందితో కలిపి మొత్తం 5,881 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

జిల్లా వ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యధికంగా జిల్లా కేంద్రంలో 13, కొత్తకోటలో 3, ఆత్మకూర్‌లో 2 చొప్పున ఏర్పాటు చేశామన్నారు. పెబ్బేరు, వీపనగండ్ల, శ్రీరంగాపురం, పాన్‌గల్‌, గోపాల్‌పేట, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్‌ కళాశాలల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 25 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 25 మంది డీఓలతో పాటు విద్యార్థుల సంఖ్య ఆధారంగా 632 మంది ఇన్విజిలేటర్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. కాగా, పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, మానసికంగా బలంగా ఉండేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ టెలిమానస్‌ పేరుతో 14416 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

#Tags