Bank employees: బ్యాంకు ఉద్యోగులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్ బెనిఫెట్స్) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది. ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది.
ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్‌మార్క్‌ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.
బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్‌బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్‌గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి.