Telangana: బడి బయటి విద్యార్థుల గుర్తింపు సర్వే

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో గత నెల 11వ తేదీన ప్రారంభమైన బడి బయట విద్యార్థుల గుర్తింపు సర్వే కొనసాగుతోంది. ప్రతిరోజు కాంప్లెక్స్‌ రిసోర్స్‌ పర్సన్లు తమ క్లస్టర్‌ పరిధిలోని ఆవాసాలలో తిరుగుతూ.. బడి బయట విద్యార్థుల గుర్తింపును చేపడుతున్నారు.

పాఠశాలలకు దీర్ఘకాలంగా రాని విద్యార్థుల వివరాలను సేకరించి, వారి ఇళ్లను సందర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడుతూ వివరాలను సేకరిస్తున్నారు. ఈకార్యక్రమంలో పలుచోట్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సైతం భాగస్వాములు అవుతున్నారు.

చదవండి: Free Study Material: జగనన్న విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్‌ పంపిణీ

తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు కూడా పాల్గొంటున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 6–14 ఏళ్ల వయసు 17 మంది విద్యార్థులను, 15–19 సంవత్సరాల వయసు గల బడిబయట విద్యార్థులు పదిమందిని గుర్తించారు. అలాగే వలస వచ్చిన విద్యార్థులు 17 మందిని, ఇక్కడ నివాసం ఉంటూ తల్లిదండ్రులు బయట వలస వెళ్లిన వారి పిల్లలు పదిమందిని గుర్తించారు.

ఇప్పటివరకు 54 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ హై తెలిపారు. వారిలో 44 మంది విద్యార్థులకు ఇప్పటికే పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించామని పేర్కొన్నారు. గుర్తింపు సర్వే ఈనెల 10వ తేదీవరకు కొనసాగనుందని పేర్కొన్నారు.

#Tags