Telangana: మనబడిపై నీలినీడలు.. పనులకు అందని బిల్లులు

హుస్నాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి గ్రామీణ విద్యార్థులకు కార్పొరేటు విద్యనందించాలనే ఉద్దేశంతో 2022 జూన్‌లో సర్కార్‌ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇందుకోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. అధికారుల పర్యవేక్షణ లోపం, నాయకుల నిర్లక్ష్యంతో ‘మన ఊరు మన బడులు’ అసంపూర్తి పనులతో వెక్కిరిస్తున్నాయి.
ప్రభుత్వ ప్రణాళికలు క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అభివృద్ధి పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు సమీక్షించకపోవడంతో బడుల్లో పలు సమస్యలు దర్శనమిస్తున్నాయి.
హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాలల్లో 32 ప్రభుత్వ పాఠశాలల్లో 90 పనులు చేయడానికి ప్రభుత్వం దాదాపు రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసింది.
పనులు చేయించే బాధ్యతలను గ్రామ సర్పంచ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్లకు అప్పగించారు. ప్రధానోపాధ్యాయుల జాయింట్‌ బ్యాంకు ఖాతాల్లో కొన్ని నిధులను జమ చేసింది. ఇప్పటి వరకు 10 పాఠశాలల్లో పనులు ప్రారంభించగా.. అవి చివరి దశకు చేరుకున్నాయి.
కూచనపల్లి పాఠశాలలో వంట గది పనులు పూర్తి చేయకుండానే రంగులు వేసి బిల్లులు తీసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌లు పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాఠశాలల్లో సగం సగం పనులే జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చదవండి: Govt Polytechnic College: ‘పాలిటెక్నిక్‌’కు జాతీయస్థాయి గుర్తింపు

చేసిన పనులకు అందని బిల్లులు

ప్రభుత్వ పాఠశాలల రక్షణకు ప్రహరీల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, వంట గదులు, ఫ్లోరింగ్‌, విద్యుత్‌ సౌకర్యం, మూత్రశాలలు, ఫర్నీచర్‌, మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్‌హాల్స్‌ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సర్కార్‌ నిధులు మంజూరు చేసింది. జాతీయ ఉపాధిహామీ పథకం నిధులను ఈ పనులకు కేటాయించారు.
పనులు చేసినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు మధ్యలోనే ఆపేస్తున్నారు. ముందు చేసిన పనులకే బిల్లులు రావడం లేదని కొందరు పనులను ప్రారంభించ లేదు.

ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మారడంతో మన ఊరు మన బడి పనులు సాగుతాయా లేదా అనేది సందిగ్ధంగా ఉంది.
నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పాఠశాలల అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరిస్తే గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

నిధులు మంజూరు చేయాలి

పందిల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉన్నప్పటికి మొదటి విడతలో మన ఊరు–మన బడి కార్యక్రమానికి ఎంపిక చేయలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా మా బడికి నిధులు మంజూరు చేసి తరగతి గదుల నిర్మాణంకు ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– తోడేటి రమేశ్‌, సర్పంచ్‌, పందిల్ల

#Tags