Anganwadi Centres: 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్‌ మీడియం

ములుగు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహా లోనే తెలంగాణలో కూడా ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు  సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 15 వేల అంగన్‌వాడీ సెంటర్లను మినీ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా అప్‌డేట్‌ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జూన్ 13న‌ మంత్రి ములుగు జిల్లా బండారుపల్లి మోడల్‌సూ్కల్‌ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున యూనిఫాం, నోట్‌ పుస్తకాలను అందించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ బలరాంనాయక్‌ మోడల్‌ స్కూళ్లను మంజూరు చేయించారని గుర్తు చేశారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొందరి పనితీరుపై మాట్లాడుతూ, ఇష్టం ఉంటే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి పనిచేయాలని, లేనిపక్షంలో ట్రాన్స్‌ఫర్‌ చేసుకొని వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. 

చదవండి: Anganwadi Workers Retirement Benefits: ‘అంగన్‌వాడీ’ల రిటైర్మెంట్‌ లబ్ధిని ఇంత‌ చేయాలి!

ఇదే క్రమంలో అర్హత పేరుతో ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు కలెక్టరేట్‌ పక్కన బైఠాయించారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న తమకు ఫిక్స్‌డ్‌ వేతనంగా రూ.18 వేలు అందించాలని నినాదాలు చేశారు. 

విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య కొంత మంది ఆశ కార్యకర్తలను మంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందించారు. కాగా, ఆశ కార్యకర్తల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఆగస్టు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  

#Tags