Government Schools: ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి.. డీఈఓ సూచన
చింతకాని: ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలోనే పాఠ్యాంశాలను బోధించాలని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మండలంలోని మత్కేపల్లి ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించి, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు 6 నుంచి 10 తరగతుల వారికి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న బేస్‌లైన్ పరీక్షను డీఈఓ పరిశీలించారు.
బేస్‌లైన్ పరీక్షల ఫలితాల్లో వెనుకబడి ఉన్న విద్యార్థుల కోసం ఉదయం, పాఠశాల అనంతరం గంట పాటు ప్రత్యేకంగా తరగతులను నిర్వహించి కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అలాగే పాఠశాలలో తరగతుల బోధనను పరిశీలించిన డీఈఓ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఆయా పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వీరపనేని శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.