10th Class Exams 2024: ఉత్తీర్ణత పై దృష్టి కంటే... పట్టుదలతో చదవడం ముఖ్యం!
ఖమ్మం: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒక ప్రణాళికతో వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఉప సంచాలకుడు కస్తాల సత్యనారాయణ అన్నారు. ప్రణాళికతో పాటు క్రమశిక్షణతో చదివితే పదిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు.
TS 10th Class Model Papers TM | EM
ఆదివారం ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖమ్మం డివిజన్‌కు చెందిన ఎస్సీ సంక్షేమ వసతిగృహంలో, సత్తుపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో గల ఎస్సీ బాలుర, బాలికల విద్యార్థులకు ప్రేరణ, భవిష్యత్తు మార్గదర్శక తరగతులను ‘ప్రేరణ’పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నోట్‌బుక్స్, ఇతర సామగ్రిని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకొని విద్యనభ్యసించాలన్నారు.
ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలలో అనుమానులు ఉంటే ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యూటర్ల ద్వారా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. నూరుశాతం ఫలితాలు సాధించేందుకు అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. ఈనేపథ్యాన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు అట్లూరి వెంకటరమణ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలి, సమయపాలన ఎలా పాటించాలి, ఏ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి సమాధానాలు ఎలా రాయాలో వివరించారు.
విద్యార్థులు ఉత్తీర్ణతపై దృష్టి పెట్టకుండా ఉత్తమ మార్కులు సాధించేందుకు పట్టుదలతో చదివితే కార్పొరేట్ కళాశాల్లో సీట్లు వస్తాయన్నారు. వారంరోజుల్లో జిల్లాలోని అన్ని హాస్టళ్లకు ఆల్‌ఇన్‌వన్‌లు పంపిణీ చేస్తామన్నారు.