Skip to main content

Tenth Class News: పదోతరగతి విద్యార్థులకు సెలవుల తర్వాత ప్రత్యేక తరగతులు

Tenth Class News: పదోతరగతి విద్యార్థులకు సెలవుల తర్వాత ప్రత్యేక తరగతులు
Tenth Class News: పదోతరగతి విద్యార్థులకు సెలవుల తర్వాత ప్రత్యేక తరగతులు

పెద్దపల్లిలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్‌: జిల్లాలో జెడ్పీ 100,ఉన్నత పాఠశాలలు 04, ఆదర్శ 07, మైనారిటీ గురుకులాలు 04, ఎయిడెడ్‌ 05, కేజీబీవీలు 10, గురుకులాలు 10, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు 172 ఉన్నాయి. వీటిల్లో 19 వేల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాల బోధన జరిగేలా విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే నెలలో సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. టెన్త్‌ ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గతేడాది ఫలితాల్లో జిల్లా 92.4 శాతం సాధించి, రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచిందని, ఈసారి అంతకన్నా మెరుగైన ఫలితాలు రావాలని సూచించారు.

టీచర్ల బోధన.. విద్యార్థుల చదువు ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం సాగితేనే పదోతరగతిలో మంచి ఫలితాలు వస్తాయి. డిసెంబర్‌ 31 నాటికి పాఠ్యాంశాల బోధన పూర్తి చేసి, పునశ్చరణ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 50 శాతం వరకు సిలబస్‌ పూర్తయిందని డీఈవోలు చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో బడిబాట, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, స్వచ్ఛతా హీ సేవ, పోషణ్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణతో కొంత ఇబ్బంది కలిగినా.. నష్టపోయిన సమయాన్ని పూడ్చేందుకు ప్రత్యేక దృష్టిసారించామని అంటున్నారు. అయితే, వరుస సెలవుల నేపథ్యంలో సిలబస్‌ పూర్తి చేయడం సాధ్యమేనా అన్న సందేహాలను విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల హ్యాట్రిక్‌ నుంచి 24వ స్థానం

జగిత్యాల: జగిత్యాల 2016–17, 2017–18, 2018–19 పదోతరగతి ఫలితాల్లో వరుసగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచి, హ్యాట్రిక్‌ సాధించింది. గతేడాది 84.05శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 13, జిల్లా పరిషత్‌ 175, ఆదర్శ 13, కేజీబీవీలు 14, బీసీ వెల్ఫేర్‌ 06, మైనారిటీ 05, టీఎస్‌ రెసిడెన్షియల్‌ 02, సోషల్‌ వెల్ఫేర్‌ 5, ప్రైవేట్‌ పాఠశాలలు 104 మొత్తం 337 స్కూళ్లు ఉన్నాయి. 11,991 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 50 శాతం సిలబస్‌ పూర్తి చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికా రులతో సమావేశాలు నిర్వహిస్తూ.. పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. జనవరి 1 నుంచి ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. టీచర్లు సీ–గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే, సెలవుల నేపథ్యంలో సిలబస్‌ పూర్తవుతుందా అని తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సమ్మేటివ్‌ పరీక్షలకు సిద్ధం

ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాల బోధన సాగుతోంది. అక్టోబర్‌ 21 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటివరకు ఉన్న లక్ష్యాల మేరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సిలబస్‌ పూర్తయింది.

                                                                   – పీఎం షేక్‌, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

వందశాతం ఫలితాలకు చర్యలు

పదోతరగతిలో వందశాతం రిజల్ట్స్‌ కు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సిలబస్‌ డిసెంబర్‌ 31 వర కు పూర్తయ్యేలా చూస్తాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. –                                                                                              జగన్మోహన్‌రెడ్డి, డీఈవో

కరీంనగర్‌లో ఇన్‌చార్జి ఎంఈవోలే..

కరీంనగర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి సిలబస్‌ అటూఇటుగా 50 శాతం పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 16 మండలాలు ఉంటే అన్నిచోట్లా ఇన్‌చార్జి ఎంఈవోలే ఉన్నారు. దీంతో టీచర్లపై పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సిలబస్‌ పూర్తి చేసి, వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మెరుగైన ఫలితాలు రావడానికి అస్కారం ఉంటుంది. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, క్రిస్మస్‌కు నాలుగు రోజులతోపాటు సాధారణ సెలవులు ఉండనున్నాయి. మరి డిసెంబర్‌లోగా సిలబస్‌ పూర్తవుతుందో లేదో వేచిచూడాలి. వీలైనంత త్వరగా సిలబస్‌ పూర్తి చేసి, పు నశ్చరణ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా 95 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి, రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది.

జిల్లాలోని పాఠశాలలు, విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలు 65, ఎంపీపీ/జెడ్పీ 598, కేజీబీవీ 14, ఆదర్శ 11, ప్రైవేట్‌ 323, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 12, ఎస్సీ గురుకులాలు 08, బీసీ గురుకులాలు 11, మైనార్టీ గురుకులాలు 09, స్పోర్ట్స్‌ స్కూల్‌ 01, అర్బన్‌ రెసిడెన్షియల్‌ 02 మొత్తం 1,060 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో పదోతరగతి విద్యార్థులు మొత్తం 12,695 మంది ఉన్నారు.

సెలవుల తర్వాత ప్రత్యేక తరగతులు

పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశాం. నిరంతర పర్యవేక్షణకు తనిఖీలు చేపడుతున్నాం. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి, ఫలితాల్లో కరీంనగర్‌ను ముందంజలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దసరా సెలవుల తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం.                                                       – జనార్దన్‌రావు, డీఈవో

గతేడాది సిరిసిల్లకు మూడోస్థానం

సిరిసిల్ల : పదోతరగతి ఫలితాల్లో జిల్లా ఏటా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. గత మూడేళ్లలో ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. గతేడాది 98.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రస్తుతం మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా రు. దసరా సెలవులకు ముందు సగం సిలబస్‌ పూర్తి చేశామని, డిసెంబర్‌లోగా శతశాతం చేరుకుంటామని అంటున్నారు. కానీ, ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా కొన్ని పాఠశాలల్లో 40 శాతమే పూర్తయినట్టు పలువురు సీని యర్‌ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 ముగిసేనాటికి సగం సిలబస్‌ అవుతుందంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 114, గురుకుల రెసిడెన్షియల్‌ 20, ఆదర్శ 07, కేజీబీవీలు 13, ప్రైవేటు 68 మొత్తం 222 పాఠశాలలున్నాయి.6,890 మంది పదోతరగతి చదువుతున్నారు.

అల్పాహారానికి నిధులు ఎలాగో?

ఏటా పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల సమయంలో గోరుముద్ద పేరిట అల్పాహారం అందిస్తున్నారు. దీనికి విద్యాశాఖ నిధులు కేటాయిస్తున్నా ఆయా పాఠశాలల పరిధిలోని దాతలు, ఎన్నారైలు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల శ్రేయస్సు కోసం అల్పాహారానికి తమవంతు సాయం చేసేవారు. అయితే, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తే రాజకీయం అవుతుందన్న చర్చ గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి అల్పాహారం కోసం నిధులు ఎలా సమకూరుస్తారో వేచిచూడాలి.

ప్రథమ స్థానమే ధ్యేయం

పదోతరగతి ఫలితాల్లో గతేడాది జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం ప్రథమ స్థానమే ధ్యేయంగా మరింత మెరుగైన విద్యాబోధన చేపడుతున్నాం. ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటాం. లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని హెచ్‌ఎంలకు, టీచర్లకు సూచించాం.                                               – రమేశ్‌, డీఈవో

 

Published date : 26 Sep 2024 09:33AM

Photo Stories