Jobs In Health Department- వైద్య ఆరోగ్య శాఖలో 2500 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హుజూర్‌నగర్‌: వైద్య ఆరోగ్యశాఖలో నర్సులు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది కలిపి సుమారు 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో 2,500 ఖాళీలను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

2,500 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌ను రాజనర్సింహ సందర్శించారు. వార్డులను తిరిగి పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2,500 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు.

దశలవారీగా మిగతా వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం జాబ్‌ కేలండర్‌ను అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని రాజనర్సింహ తెలిపారు.

ఆరోగ్యశ్రీ కింద రూ.487 కోట్లు
ఆరోగ్యశ్రీ కింద 1,800 వ్యాధులకు రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్, హెల్త్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్, జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు పాల్గొన్నారు. 

#Tags