TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భర్తీ చేస్తాం ఇలా..!
తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదు సంవత్సరాలలో పదివేల ఖాళీలు ఏర్పడతాయని సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ ఏడాది నుంచే.. వచ్చే ఐదేళ్లు ప్రతి ఏడాది దాదాపుగా 2000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలిపింది. దీంతో రానున్న ఐదు సంవత్సరాలు పదివేల ఉద్యోగ ఖాళీలు ఆర్టీసీలో ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ రిటైర్ కాలేదు.
ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారుసులతో..
2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గత ఏడాది ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1,927 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 2029 వరకు పదివేల మందికిపైగా పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారుసులతో గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు బస్సులకు అదనపు ఉద్యోగులు అవసరం అవుతారని పేర్కొంది. దీంతో తాజా ఉద్యోగ ఖాళీలపై ప్రతిపాదనలు మరొకసారి పంపాలని సూచించారు.
జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని కావున ఎన్ని పోస్టులు అవసరమాయితాయో ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. తాజాగా ఆర్థిక శాఖ 3,035 ఆర్టిసి ఉద్యోగాల నియామకానికి పచ్చ జెండా ఊపి.. భర్తీకి చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే.