3,035 TGRTC Jobs: ఆర్టీసీలో బారీగా ఉద్యోగాలు.. కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది.
కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు.
చదవండి: Road Transport Corporation: ఆర్టీసీ కీలక నిర్ణయం.. అంత్యక్రియల వ్యయం పెంపు.. ఎంతంటే..
సాలీనా రూ.15 కోట్ల వ్యయం
కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు.
సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది.
ముందే అదనపు డ్యూటీల భారం
ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్‌లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది.
డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్‌మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్‌మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యర్థిస్తూ వచ్చారు.
చదవండి: Students Free Bus Pass news: విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఇకపై ఉచిత బస్‌పాస్
జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది.
కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా:
డ్రైవర్లు |
2000 |
శ్రామిక్ |
743 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) |
114 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) |
84 |
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ |
25 |
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) |
23 |
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ |
15 |
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) |
11 |
మెడికల్ ఆఫీసర్ (జనరల్) |
7 |
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్టు) |
7 |
అకౌంట్స్ ఆఫీసర్లు |
6 |
టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం
కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్‌లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు.
Tags
- TGRTC
- RTC Jobs
- TSRTC Jobs 2024
- Mahalakshmi Scheme
- RTC Driver
- RTC Conductor
- 3035 TGRTC Jobs
- Telangana News
- 3035 posts in TGSRTC Notification
- tsrtc recruitment 2024
- HyderabadRecruitment
- GovernmentJobs
- PublicTransportCareers
- telanganajobs
- CareerOpportunities
- GovernmentRecruitment
- JobVacancies
- RTCRecruitment2024
- HyderabadJobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notificatons