Anganwadi Workers : ఆ అంగన్‌వాడీ పోస్టులకు భర్తీకి నేటి వరకు నోటిఫికేషన్‌ రాలేదు.. క‌నీసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని అంగన్‌వాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు సెంటర్లలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్‌ కనెక్షన్‌ లేవు. గ్యాస్‌, అద్దె భవనాల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో టీచర్లు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నారు.

అసౌకర్యాల మధ్య పిల్లలు..
మహబూబాబాద్‌ జిల్లాలో 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 341 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. అలాగే 604 సెంటర్లు అద్దె లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, పలు ప్రభుత్వ శాఖల భవనాల్లో కొనసాగుతుండగా.. మిగిలిన 492 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 1,024 కేంద్రాలకు మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. 488 కేంద్రాల్లో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. 711 కేంద్రాలకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌ ఉంది. ఇలా అసౌకర్యాల మధ్య పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
ఐదు ప్రాజెక్టులు..జిల్లా పరిధిలో మానుకోట, గూడూరు, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కాగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్ల లు 20,306 మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 13,963 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు కలిపి 8669 ఉండగా మొత్తంగా 42,938 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. సూపర్‌వైజర్లు 58 మందికి గాను 49 మంది ఉన్నారు.

☛ Anganwadi Jobs : భారీగా అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే జీతాలు పెంపునకు కూడా..: మంత్రి సీతక్క

టీచర్లలో ఎక్కువ మందికి..
జిల్లాలోని 152 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను గత ఏడాది డిసెంబర్‌ మాసంలో అప్‌గ్రేడ్‌ చేయగా అన్ని మెయిన్‌ కేంద్రాలు అయ్యాయి. ఆయా కేంద్రాల్లో పనిచేసే టీచర్లలో ఎక్కువ మందికి పదో తరగతి విద్యార్హత ఉంది. పదోన్నతులు కల్పించాలంటే తప్పనిసరిగా ఇంటర్‌ ఉండాలి. దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు. అలాగే ఆ కేంద్రాల్లో 152 మంది హెల్పర్‌ పోస్ట్‌ల భర్తీ చేయాల్సి ఉంది. హెల్పర్లకు కూడా ఇంటర్‌ విద్యార్హత ఉండాలి. కాగా ఆ పోస్టుల భర్తీకి నేటి వరకు నోటిఫికేషన్‌ రాలేదు.

ఈనెల 16న కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి తాగునీటి సరఫరా, విద్యుత్‌ కనెక్షన్‌, మరుగుదొడ్డి ఉండాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతోనైనా కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన జరిగేనా అని పిల్లలు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.మానుకోట సీడీపీఓ డెబోరా చేసిన అవకతవకల వల్ల గత కలెక్టర్‌ శశాంక ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. రెండు నెలల పాటు గడువు ఇచ్చినా తన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోనే సరెండర్‌ చేసినట్లు జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి తెలిపారు.

కొన్ని కేంద్రాల్లో టీచర్లు సూపర్‌ వైజర్లను
సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లోపంతో కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు సమయపాలన పాటించడం లేదు. వాస్తవానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్లు కేంద్రాల్లో ఉండాలి. కానీ చాలా సెంటర్లు మధ్యాహ్నం వరకే మూసివేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో టీచర్లు సూపర్‌ వైజర్లను మేనేజ్‌ చేసుకుని ఆయాలతో సెంటర్ల నిర్వహణ చేపడుతున్నారు. అలాగే సెంటర్లలో ఖాళీ స్థలం ఉంటే న్యూట్రిషన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. చాలా వరకు ఏర్పాటు చేయలేదు.

☛ Telangana Mega DSc Notification : త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేలా..

 ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాకపోవడంతో..
కేంద్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల బిల్లులు గత ఏడాది జూలై వరకు మాత్రమే వచ్చాయి. కాగా ఆరు నెలల గ్యాస్‌ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అద్దెభవనాల బిల్లులు గత ఏడాది ఆగస్టు వరకు రాగా నాలుగు నెలలు బిల్లులు నేటి వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాకపోవడంతోనే బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు..

☛ జిల్లాలో 1437 అంగన్‌వాడీలు..
☛ అద్దె భవనాల్లో 492 సెంటర్లు
☛ పెండింగ్‌లో గ్యాస్‌, అద్దె బిల్లులు
☛ సమయ పాలన పాటించని టీచర్లు
☛ మినీ టీచర్ల అప్‌గ్రేడ్‌పై స్పష్టత కరువు
☛ సెంటర్‌లో ప్రమాదకరంగా నల్లా సంప్‌
☛ సెంటర్‌లో ప్రమాదకరంగా నల్లా సంప్‌
☛ సెంటర్‌లో ప్రమాదకరంగా నల్లా సంప్‌

#Tags