Success Story : తీవ్రమైన పోటీని తట్టుకొని.. ఒకే సారి నాలుగు గవర్నమెంట్ జాబ్‌లు కొట్టానిలా... కానీ..!
చాలా మంది ప్రయత్నాలు చేసి.. అందులో విఫలమైతే తీవ్ర నిరాశలోకి వెళ్తారు. కానీ కొందరు మాత్రం ఎన్ని సార్లు విఫలం చెందిన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఒక రైతు బిడ్డ.. తీవ్రమైన పోటీని తట్టుకొని ఒకే సారి .. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా... నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో ఈ రైతు బిడ్డ సక్సెస్ స్టోరీ మీకోసం...
కుటుంబ నేపథ్యం :
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘనాథ్ శంకర్ అనే యువకుడు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి కర్రి సత్యనారాయణ. ఈయన ఒక సాధారణ రైతు. తల్లి నాగమణి. ఈమె గృహిణి. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వారు శంకర్ తండ్రి.
ఎడ్యుకేషన్ :
శంకర్.. విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలో సాగింది. అతడికి చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. ఆ దిశగానే తన అడుగులు వేశాడు.
వ్యవసాయ పనులు చేస్తూ...
తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ స్థానిక లైబ్రరీలో ఉన్న పుస్తకాలతో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. అతడు ప్రత్యేకించి ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన వివిధ ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో ఏకంగా నాలుగు ఉద్యోగాలను సాధించాడు. అది కూడా ఎలాంటి కోచింగులు లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం.
సాధించిన ఉద్యోగాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో జైల్ వార్డన్స్, పోలీసు శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా , ఇన్‌కమ్ టాక్స్, సీబీఐల్లో గ్రేడ్-బి ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లోనూ విజయం సాధించాడు. వీటితో పాటు రైల్వే కమర్షియల్ అప్రంటీస్ పోస్టు కోసం నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించాడు.
నేను ఈ ఉద్యోగం వైపే...
ప్రజలకు మంచి సేవలు అందించే లక్ష్యంతో తాను ఎస్‌ఐ పోస్టును ఎంచుకుంటున్నట్లు తెలిపాడు.
నా ఆదర్శం వీరే..!
లైబ్రరీయే తన కోచింగ్ సెంటర్ అని, తన తల్లిదండ్రులు, నాన్నమ్మ ప్రోత్సాహంతో మామయ్యను ఆదర్శంగా తీసుకుని ఈ విజయం సాధించాను శంకర్ తెలిపాడు.
మనిషి అనుకుంటే సాధించనదంటూ ఏమున్నదిని రైతు బిడ్డ కర్రి రఘనాథ్ శంకర్ నిరూపించాడు. ఏళ్ల తరబడి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉన్న యువతకు రఘునాథ్ శంకర్ ఆదర్శంగా నిలిచారు.