Inspirational Success Story : ఒక సాధారణ రైతు కొడుకు.. ప్రభుత్వానే ఎదిరించి డాక్టర్ అయ్యాడిలా.. కానీ..
తనశారీరక వైకల్యాన్ని వెక్కిరించినా పట్టువీడలేదు. కోర్టుకు వెళ్లి మరీ తన కల నెరవేర్చుకున్నాడు. సంకల్పం ఉంటే కాదేదీ అసాధ్యం అని నిరూపించాడు గుజరాత్‌కు చెందిన ఒక యువ వైద్యుడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా ప్రపంచ రికార్డుకు అర్హత సాధించాడు. ఇంతకీ ఎవరా వైద్యుడు ? ఏమా కథ..? స్ఫూర్తిదాయకమైన ఈ స్టోరీ మీకోసం..
కేవలం ఎత్తు కారణంగానే..
చిన్నతనంలో కూడా తన పరిస్థితి గురించి బాధపడుతూ కూర్చోలేదు. తొలుత 10వ తరగతి , తర్వాత ఇంటర్ విద్యను కంప్లీట్ చేశాడు.. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో 233 మార్కులు సాధించాడు. ఇక్కడే ఆయన జీవితంలో అనుకోని పరిణామం ఎదురైంది. తన పరిస్థితే తన కలలకు, కరియర్‌కు అడ్డంకిగా మారుతుందని అస్సలు ఊహించలేదు. అసమానతలను ధిక్కరించి, MBBS ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, ప్రవేశపరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా, కేవలం ఎత్తు కారణంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి నిరాకరించారు. ఎత్తు కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అత్యవసర కేసులను నిర్వహించలేవంటూ భారత వైద్య మండలి కమిటీ తిరస్కరించింది.
ఏమాత్రం నిరాశచెందకుండా సుప్రీంకోర్టును..
దృఢ సంకల్పంతో భావ్‌నగర్ కలెక్టర్ సలహా మేరకు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఈ కేసు ఓడిపోయాడు. అయినా ఏమాత్రం నిరాశచెందకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆయనకు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చని సుప్రీం సూచించింది. మెడికల్ విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్ డాక్టర్‌గా సేవలందిస్తూ, తిరుగులేని నిబద్ధతతతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాడు.
ఒక సాధారణ రైతు కొడుకు..
ఒక సాధారణ రైతు కొడుకు గణేష్‌కి ఎనిమిది మంది తోబుట్టువులు. వారంతా 10వ తరగతితోనే చదువు ఆపేశారు.వారి కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన తొలి వ్యక్తిగా, ఇపుడు తొలిడాక్టర్‌గా చరిత్ర సృష్టించారు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్‌కు అర్హత సాధించడం విశేషం. తనకు సాయం చేసిన, ధైర్యం చెప్పిన అందరికీ గణేష్ కృతజ్ఞతలు తెలిపాడు గణేష్.