TGSWREIS: ఎస్సీ గురుకులంలో కొలిక్కిరాని బదిలీలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)లో ఉద్యో గుల బదిలీలు, పదోన్నతుల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ సొసైటీ పరిధిలో బోధన ఉద్యోగులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీల ప్రక్రియ నిర్వహిస్తూనే సమాంతరంగా పదోన్నతులు సైతం ఇచ్చారు. అర్హతలున్న వారు పదోన్నతులు పొందగా...బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగులు ఆన్‌లైన్‌ పద్ధతిలో వెబ్‌ ఆప్షన్లు సమర్పించారు.

ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఆలస్యంగా ఆగ‌స్టు 1న‌ అర్ధరాత్రి పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోస్టింగ్‌ ఉత్తర్వులు పొందిన చాలామంది ఉద్యోగులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చదవండి: Collector Inspection: గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

పదోన్నతుల జాబితాలో పేర్లు లేవు..

పదోన్నతులు పొందిన వారికి సమాచారమున్నా ప్రమోషన్‌ జాబితాలో మాత్రం పేర్లు కనిపించలేదు. మరికొందరు పోస్టుల్లేని స్థానాలకు బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల ఒకే పోస్టుకు ఇద్దరు కంటే ఎక్కువ మందిని బదిలీ చేసినట్లు గుర్తించారు.

ఉద్యోగులు ఆగ‌స్టు 2న‌ రిపోర్టు చేసేందుకు సదరు పాఠశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో వారు సొసైటీ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి రావడంతో గురువారం సొసైటీ కార్యాలయం తీవ్ర గందరగోళంగా తయారైంది. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సొసైటీ అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.  
 

#Tags