Telangana: టెట్ లో ఉత్తీర్ణ‌త శాతం ఎందుకు ప‌డిపోయింది..?

ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎంతో మంది టెట్ అభ్య‌ర్ధులు శిక్ష‌ణ తీసుకుంటున్నారు. కానీ, ఎవ‌రికి కూడా క‌నీస మార్కులు ల‌భించ‌డం లేదు. 2017లో భ‌ర్తీ అయిన సీట్లు మ‌ళ్ళీ ఇన్నాకీ ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేక‌పోయారు. ఈ ఉత్తీర్ణ‌త త‌గ్గ‌టానికి కార‌ణాలు...
tet candidates

సాక్షి, ఎడ్యుకేష‌న్:  రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్‌ విద్యార్హతతో రాసే పేపర్‌–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం.

ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ ఇస్తామని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్‌ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్‌ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌తోపాటు టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేవారని.. టీచర్‌ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్‌ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్‌పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్‌గా ప్రిపేర్‌ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. 

అందని అర్హత గీటురాయి: టెట్‌ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్‌–1 (డీఎడ్‌ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్‌–2 (బీఎడ్‌ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు.

మేథ్స్, ఇంగ్లిష్‌ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్‌లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్‌ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.

ఇక ఇంగ్లిష్లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్‌డ్‌ లాంగ్వేజ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్‌ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్‌–1 ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్‌ టీచింగ్‌ మెథడ్స్‌పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. 

నాలుగున్నర లక్షల మందిలో.. 
రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్‌ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్‌ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్‌ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్‌లో పేపర్‌–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)’ పోస్టులకు..  పేపర్‌–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది.

డీఎడ్‌ పూర్తిచేసినవారు పేపర్‌–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్‌ వారు పేపర్‌–1, పేపర్‌–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్‌–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్‌ వారు పేపర్‌–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్‌–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. 

ఇంగ్లిష్, మేథ్స్‌కు కష్టపడాలి 
కేవలం 45 రోజుల్లోనే టెట్‌కు ప్రిపేర్‌ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్‌లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్‌ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్‌ నోటిఫికేషన్‌ రాకపోవడం నిరాశగా ఉంది.  – స్వాతి, టెట్‌ అభ్యర్థి, భూపాలపల్లి 

నియామకాలుంటేనే ఉత్సాహం 
టెట్‌ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్‌ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్‌ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తారని  ఆశిస్తున్నాం. 
– ఇఫ్రాన్‌ పాషా, టెట్‌ అభ్యర్థి, ములుగు జిల్లా 

చ‌ద‌వండి:

Mega Job Mela 2023 : రేపు ప్ర‌ముఖ కంపెనీల‌తో.. మెగా జాబ్‌ మేళా.. అర్హ‌త‌లు ఇవే..

Andhra Pradesh Jobs: AP స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 800+ ఉద్యోగాలు!

 

#Tags