TS Govt Announces PRC: ఫిట్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. సంబరాల్లో ఉద్యోగులు

ఆదిలాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు 21శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మార్చి 9న‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ మేరకు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పలుచోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఉద్యోగులకు 2013 వేతన సవరణ బకాయిలతో పాటు 2017, 2021లకు సంబంధించి పీఆర్సీలను చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో 2013 పీఆర్సీకి సంబంధించి 50 శాతం చెల్లించగా, మిగిలిన ఎరియర్స్‌ను బాండ్లుగా అందజేసింది.

ఈ బాండ్ల బకాయిలను సైతం 8.75 శాతం వడ్డీతో మార్చి 11 తర్వాత చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూనే.. ఉద్యోగ భద్రత విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.

చదవండి: 3000 RTC Jobs Notification 2024 : ఆర్టీసీలో 3,000 డ్రైవర్, కండక్టర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

21శాతం ఫిట్‌మెంట్‌

ఇప్పటికే 2017కు సంబంధించి 16శాతం మధ్యంతర భృతిని ఇప్పటికే అందిస్తున్నారు. అదనంగా మరో ఐదు శాతాన్ని పెంచి 21శాతం ఫిట్‌మెంట్‌గా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 9న‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 పీఆర్సీని 21శాతం ఫిట్‌మెంట్‌తో అదే ఏడాది ఏప్రిల్‌ 1నుంచి అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2021 పీఆర్సీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫిట్‌మెంట్‌ జూన్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పేస్కేల్‌–2017 బకాయిలను ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల జీతం రూ. 8వేల నుంచి 11వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని వివరించింది.

విలీనంపై స్పష్టత కరువు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం అయింది. అయితే ఈ విషయమై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇటీవల కాంగ్రెస్‌ సర్కారు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో పనిభారం పెరిగినా శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఫిట్‌మెంట్‌ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూనే ఉద్యోగ భద్రతపై కూడా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
 

#Tags