High Court: ఆంగ్లంతోపాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వండి
నోటిఫికేషన్‌కు భిన్నంగా కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా, ఈ పరీక్షను ఆంగ్లంతోపాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఆర్‌ఈఐఆర్‌బీ)ని హైకోర్టు ఆదేశించింది. 2023, ఏప్రిల్ 5న నోటిఫికేషన్‌లో పేర్కొన అంశాలను పాటించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లను అనుమతించింది. ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ఏప్రిల్‌లో టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆగస్టు 1న ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. నోటిఫికేషన్‌లో రెండు భాషల్లో (ఆంగ్లం, తెలుగు)లో పరీక్ష ఉంటుందని పేర్కొనగా, పరీక్ష మాత్రం ఆంగ్లంలోనే సాగింది. దీన్ని సవాల్ చేస్తూ జోగుళాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం తాండ్రపాడుకు చెందిన జి.వినోద్‌తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తిరిగి రెండు భాషల్లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపిస్తూ.. ‘నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా రెండు భాషల్లో పరీక్ష నిర్వహించడంలో టీఆర్‌ఈఐఆర్‌బీ విఫలం అయ్యింది. ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది.
తెలుగు మీడియం అభ్యర్థులు కూడా వేలల్లో పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను తెలుగులోనూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలోని ఇన్‌స్టిట్యూషన్‌లలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న విషయాన్ని స్టాండింగ్ కౌన్సిల్ రమేశ్ ప్రస్తావించారు.
చదవండి: Free Coaching for Competitive Exams: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పోటీతత్వ విద్యా వాతావరణాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షను నిర్వహించడం సరిపోతుందని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తిరిగి పరీక్ష నిర్వహించాలని టీఆర్‌ఈఐఆర్‌బీని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.