Govt Teacher Post: Govt టీచర్ పోస్టు For Sale ఎక్కడంటే..?
నెల్లూరు (టౌన్): జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆయా యాజమాన్యాలతో జిల్లా విద్యాశాఖాధికారులు కుమ్మక్కైయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగులు ఉన్నప్పటికీ వీరితో సర్దుబాటు చేయడానికి ఎయిడెడ్ యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి.
Tally లో ఉచిత శిక్షణ జీతం 15వేలు: Click Here
నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి వారు కొత్తగా ఉపాధ్యాయుల నియామకానికి సిద్ధపడుతుంటే.. విద్యాశాఖ దన్నుగా నిలుస్తోంది. జిల్లాలో అల్లూరు–2, బుచ్చిరెడ్డిపాళెం–1, గుడ్లూరు–1, కలువాయి–1, కావలి–3, కొడవలూరు–2, కోవూరు–2, నెల్లూరు–9, సీతారామపురం–1, ఉలవపాడు–2, వింజమూరు–1 లెక్కన 25 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అయితే నెల్లూరులోని కస్తూరిదేవి హైస్కూల్, సంతపేటలోని సెయింట్ జోసెఫ్ గరల్స్ ప్రాథమిక పాఠశాల, మూలాపేట వేద సంస్కృతి పాఠశాల, కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని ఎంఎస్‌ఓ ప్రాథమిక పాఠశాల, కావలిలోని ఎస్‌ఎస్‌సీ విశ్వోదయ గరల్స్ హైస్కూల్, అల్లూరులోని రామకృష్ణ జూనియర్ కళాశాల, లేగుంటపాడులోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చినట్లు తెలిసింది.
జిల్లాలో 20 మంది మిగులు ఉపాధ్యాయులు
ఎయిడెడ్ పాఠశాలల విభాగంలో 20 మంది వరకు మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న జీఓ విడుదల చేసింది. అందులో భాగంగా 10 మంది ఉపాధ్యాయులను కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్న ఆయా ఎయిడెడ్ పాఠశాలలకు నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఆయా యాజమాన్యాలు వ్యతిరేకించాయి. సంతపేటలోని సెయింట్ జోసెఫ్ ప్రాథమిక పాఠశాల యాజమాన్యం మాత్రమే సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను అంగీకరించింది. మిగిలిన యాజమాన్యాలు తమ పాఠశాలల్లో ఖాళీలను కొత్త పోస్టులతో తామే భర్తీ చేసుకుంటామంటూ విద్యాశాఖాధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయి. పరిణామాలను గమనించిన జిల్లాలో మిగిలిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు కూడా సొంతంగా పోస్టుల భర్తీ చేసేందుకు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు
ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టు కేటగిరీని బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు బహిరంగ మార్కెట్లో బేరం పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచరుకు రూ.15 లక్షలు, స్కూల్ అసిస్టెంట్‌కు రూ. 25 లక్షలు, పీఈటీకి రూ.10 లక్షలు బేరం పెట్టినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నట్లు సమాచారం. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఆయా యాజమాన్యాలు నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కస్తూరిదేవి స్కూల్ యాజమాన్యం 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పాఠశాలల్లో ఆయా పోస్టుల్లో ముందుగానే ఒప్పందం చేసుకున్న అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
లోపాయికారి ఒప్పందంతో..
ఆయా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియకు ఇప్పటికే యాజమాన్యాలు విద్యాశాఖాధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆ క్రమంలోనే పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అత్యధిక మార్కులు, రోస్టర్ కం రిజర్వేషన్, వయస్సు అన్ని నిబంధనల ప్రకారమే ఉండే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షను కూడా నిబంధనల ప్రకారం జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం యాజమాన్యాలు పరీక్ష ప్రశ్నపత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోస్టు కోసం అడ్వాన్స్ తీసుకున్న అభ్యర్థులకు ముందు రోజు రాత్రి అందజేస్తారని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే చెబుతున్నారు.
అంతా గోప్యం
ఎయిడెడ్ పాఠశాలల వివరాలు, ఖాళీ పోస్టులు, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న యాజమాన్యాల వివరాలను ఎయిడెడ్ విభాగంలోని ఏడీ, సూపరింటెండెంట్‌తో పాటు విద్యాశాఖాధికారులు అందరూ గోప్యత పాటిస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలల వివరాలపై ఏడీ విజయకుమార్‌ను సంప్రదించగా డీఈఓ ఆదేశాలు లేనిదే ఏ విషయం చెప్పమని సమాధానం ఇచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి సెలవుపై వెళ్లినట్లు చెబుతున్నారు, ఇన్‌చార్జి డీఈఓగా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు. ఇదంతా చూస్తుంటే.. ఎయిడెడ్ యాజమాన్యాలతో జరిగిన ఒప్పందం నేపథ్యంలోనే అంతా రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పోస్టుల భర్తీకి వచ్చిన అనధికార మొత్తాన్ని పాఠశాలల యాజమాన్యాల నుంచి జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి, ఆ కింద స్థాయి అధికారుల వరకు పంచుకుంటారని విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖాళీ పోస్టులకు యాజమాన్యాలు
జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు యాజమాన్యాలు బహిరంగ మార్కెట్లో బేరం పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీకి హైకోర్టు నుంచి కొన్ని ఎయిడెడ్ పాఠశాలలు ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను మిగులు ఉపాధ్యాయులతో సర్దుబాటు చేస్తామంటే యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయి. మా పాఠశాలల్లో పోస్టులను మేమే భర్తీ చేసుకుంటామని ఆయా యాజమాన్యాలు విద్యాశాఖాధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన యాజమాన్యాలు కూడా వీరి బాటే పడుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్క పోస్టుకు కేటగిరీని బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆయా యాజమాన్యాలు బేరం పెట్టాయి.