School Text Books: పాఠ్యపుస్తకాల్లో ఆ పదాలు తొలగింపు.. కార‌ణం ఇదే..

న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పేర్కొంది.

పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్‌ పాకిస్తాన్‌ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది.

నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు.

చదవండి: CBSE New Syllabus: సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌..ఈ ఏడాది నుంచే అమల్లోకి

11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్‌లో ‘‘ 2002 గుజరాత్‌ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్‌సీఈఆర్‌టీ భావించింది.

12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్‌లో కొత్తగా ఆర్టికల్‌ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్‌లో ‘‘ 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు.   
 

#Tags