Half Day Schools: మధ్యాహ్నం బడి కష్టాలు!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వేసవి మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని ఎండల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఒంటి పూట బడులను ప్రారంభించింది. సాధారణంగా ఒంటి పూటబడి అంటే ఉదయం పూటే తరగతులు ముగించుకుని మధ్యాహ్నం ఎండ జోరు పెరిగేలోగా విద్యార్థులు ఇళ్లు చేరుకోవాలి.

అయితే, ఇక్కడే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాదిమంది పిల్లలకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఆ వెంటనే పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ప్రతీ మండలంలోని రెండు లేదా మూడు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు నడుస్తున్నాయి. దీంతో విధి లేక ఒంటి పూట బడికి మధ్యాహ్నం సమయంలో హాజరవాల్సి వస్తుంది.
పరీక్ష ఉన్న రోజుల్లో ఎలాగోలా ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్దుకుంటున్నారు. కానీ, ఒక్క జగిత్యాల జిల్లాలో పది పరీక్షలు ముగిసేదాకా మధ్యాహ్నం పనివేళలే కొనసాగుతాయని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ జిల్లా విద్యార్థులు కంగుతిన్నారు. చేసేది లేక ఎండలోనే పాఠాలకు హాజరవుతున్నారు.

చదవండి: Sub Inspector of Police TVR Suri: ఆ ఇద్దరి చదువుల బాధ్యత నాదే

ఏంటి సమస్య?

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మూడు రోజుల వ్యవధితో పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు కూడా మంజూరయ్యాయి. ఈ క్రమంలో ఒంటిపూట బడి అమలు చేసే విషయంలో వీరు పనివేళలను మార్చుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఉదయం 7.45 గంటలకు మొదలైన పాఠశాల పనివేళలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగాలి.
అయితే, పరీక్షా కేంద్రాలు కేటాయించిన చోట విద్యార్థులు తమ ఒంటి పూట బడిని అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని జిల్లాల విద్యార్థులు మధ్యాహ్నం 1 గంటలకు పాఠశాల పనివేళలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగుతున్నాయి. ఈక్రమంలో పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, ఉక్కపోత వల్ల పాఠాలు సరి గా వినలేక పోతున్నారు. మరోవైపు మధ్యాహ్నం ఒంటిపూట పాఠశాల నడుస్తున్న క్రమంలో అందులో విద్యనభ్యసించే వారికి భోజనం పూర్తయి వడ్డించే సరికి మ.3గంటలు దాటుతోంది.
అప్పటి వరకు ముఖ్యంగా హాస్టల్‌లో ఉండే పిల్లలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తరగతుల్లో ఫ్యాన్లు, తాగునీరు సదుపాయాలు పూర్తిస్థాయిలో లేవని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈనెల 30వ వరకు పదో తరగతి పరీక్షలు నడుస్తాయి. రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో పరీక్షలేని రోజుల్లో ఉ యదం పూటే తరగతులు జరుగుతున్నాయి. కానీ, ఒక్క జగిత్యాల జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. కనీసం పది పరీక్షలు లేని రోజుల్లోనైనా తమకు ఉదయంపూట బడి నడిచేలా జిల్లా విద్యాధికారి (ఈడీవో) అయినా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#Tags