Scholarships: చదువుకుంటే ఉపకారం.. చివరి తేదీ ఇదే..
ఇందు కోసం ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను గుర్తిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా, దరఖాస్తుకు సెప్టెంబర్ 6వ తేదీ వరకూ గడువు ఉంది.
ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న బాల, బాలికలు అర్హులు. పోటీ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకూ ఏటా రూ.12వేలు చొప్పున ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
చదవండి: విదేశీ విద్యాపథకానికి దరఖాస్తుల స్వీకరణ
ఏటా 4,087 మంది అర్హులు..
దేశవ్యాప్తంగా ఏటా లక్ష మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాస్తుండగా... ఇందులో ఏపీ నుంచి ఏటా 4,087 మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హత సాధిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఏ జిల్లాకు ఎంతమంది అర్హులనేది నిర్ణయిస్తారు.
ఒక్కసారి అర్హత సాధిస్తే నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలను స్కాలర్‌షిప్పు రూపంలో అందజేస్తారు. మొత్తం నాలుగేళ్ల పాటు ఈ ఉపకార వేతనం అందుతుంది.
దరఖాస్తుకు అర్హతలివే...
- 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- తుది ఎంపిక సమయం నాటికి 8వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధిస్తే చాలు.
- ప్రభుత్వ, మున్సిపల్, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదివిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
- విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.
- రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- ఓసీ జనరల్, బీసీ, పీహెచ్ విద్యార్థులకు 40 శాతం అంటే 36 మార్కులు రావాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29 మార్కులు) వస్తే చాలు.
పరీక్ష విధానం..
మెంటల్ ఎబిలిటీ టెస్ట్(మ్యాట్):
ఇందులో 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు కేటాయిస్తారు. తప్పిదాలకు మైనస్(నెగటివ్) మార్కులు ఉండవు.
స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శాట్):
ఇందులోనూ 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. 7వ, 8వ తరగతుల స్థాయిలో సైన్స్, సోషయల్, మ్యాథ్స్ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగటివ్ మార్కులు ఉండవు. ఫిజిక్స్‌లో 12 మార్కులు, కెమిస్ట్రీలో 11, బయాలజీలో 12, మ్యాథ్స్‌లో 20, హిస్టరీలో 10, జియాగ్రఫీలో 10, పొలిటికల్ సైన్స్‌లో 10, ఎకనామిక్స్‌లో 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం..
- రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా పాఠశాలలు సమర్పించాలి.
- సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సెప్టెంబర్ 6వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేయించుకోవాలి.
- ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది. ఎస్‌బీఐ చలానా రూపంలో ఫీజులు చెల్లించాలి.
- సెప్టెంబర్ 10వ తేదీలోపు ఫీజులు చెల్లించవచ్చు.
- దరఖాస్తు ఫారాలు, ధ్రువీకరణ పత్రాలను సెప్టెంబర్ 10వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో హెచ్‌ఎంలు అందజేయాలి.
- అదే నెల 15వ తేదీన డీఈఓ స్థాయిలో దరఖాస్తులను అప్రూవల్ చేసి, అర్హులైన విద్యార్థులకు డిసెంబర్ 8న పోటీ పరీక్ష నిర్వహిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే మెరిట్ స్కాలర్ షిప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఉన్నత చదువులు అభ్యసించాలనే ఆశయం ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మాత్రమే అర్హులు.
– మీనాక్షి, డీఈఓ