Admissions: రాష్ట్రంలోని అంధ బాలికలకు అడ్మిషన్లు ప్రారంభం

Admissions

విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల కోసం విశాఖపట్నం, విజయనగరం, హిందూపూర్‌లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. బీచ్‌రోడ్డు(ఎండాడ)లోని 3 ఎకరాల విస్తీర్ణంలో 1987లో ఈ పాఠశాల ఏర్పాటు చేయగా.. ఇక్కడ బాలికలకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు గల 40 శాతంకు పైగా అంధత్వం కలిగిన వారు ఇక్కడ చేరేందుకు అర్హులు. 1 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే ఈ పాఠశాలలో 100 మంది ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. ప్రసుత్తం 60 మంది బాలికలు చదువుతున్నారు.

కార్పొరేట్‌కు దీటుగా వసతులు

అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇచ్చే యూనిఫాంతో పాటు జగనన్న విద్యాకానుక వీరికి అందిస్తున్నారు. నాడు–నేడు రెండో దశ కింద ప్రభుత్వం రూ. 27లక్షలు మంజూరు చేయగా.. ఈ నిధులతో పాఠశాల, విద్యార్థినుల అవసరాల మేరకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పది ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత

ఎస్‌సీఈఆర్టీ సిలబస్‌తో ప్రభుత్వం బ్రెయిలీ లిపితో ముద్రించిన పుస్తకాలను వినియోగిస్తూనే.. అధునాతన పరికరాలతో ఇక్కడి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. నాన్‌ వెర్బల్‌ డెస్క్‌టాప్‌ అసిస్టెంట్‌(ఎన్‌వీడీఏ) విధానం ద్వారా కంప్యూటర్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే శబ్ధాలను అనుసరించి కంప్యూటర్లతో సరికొత్త పాఠ్యాంశాలను నేర్చుకుంటున్నారు. డైజీ ప్లేయర్‌లో రికార్డు చేసిన పాఠ్యాంశాలను వింటూ చదువుల్లో ముందుకెళ్తున్నారు. బ్రెయిలీ లిపితో నిక్షిప్తం చేసిన ‘అని సిస్టమ్స్‌’(దివీస్‌ సంస్థ స్పాన్సర్‌) విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి విద్యార్థినులు గత కొన్నేళ్లుగా పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధిస్తున్నారు.

ఆటల్లోనూ మేటి

ఇక్కడి విద్యార్థినులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. ఎం.సత్యవతి అనే పూర్వ విద్యార్థిని ఇటీవల జరిగిన అంధుల ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించింది. పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇస్తుండటంతో బాలికలు చెస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ తదితర పోటీల్లోనూ తమ సత్తా చాటుతున్నారు.

వారంతా మా పిల్లలే..

నాకూ కంటి చూపు లేదు. అయినా టీచర్‌ అయ్యాను. మీరు కూడా ప్రయోజకులు కావాలని విద్యార్థినుల్లో స్ఫూర్తి రగిస్తున్నాం. వారంతా మా పిల్లలులాంటి వారే. ప్రభుత్వ ఆశయాల మేరకు వారితో పాటు పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నాం. వార్డెన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూనే.. ప్రైమరీ తరగతులకు బోధిస్తాను.

గతంలో కన్నా మార్పు

15 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాను. కంటి చూపు లేదని కుంగిపోకుండా.. మనో ధైర్యంతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విద్యార్థినుల్లో ప్రేరణ కలిగిస్తున్నాం. తోటి ఉపాధ్యాయులంతా ఎంతో సహకరిస్తున్నారు. సంస్థ డైరెక్టర్‌ బి.రవిప్రకాశ్‌రెడ్డి చొరవతో పాఠశాలలో గతంలో కన్నా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇంకో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఎక్కడ వారినైనా చేర్చుకుంటాం.

#Tags