PM SHRI Scheme: పీఎం శ్రీ పథకానికి 21 పాఠశాలలు ఎంపిక..

ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం శ్రీ) పథకానికి గుంటూరు జిల్లాలో 21 పాఠశాలలు ఎంపికయ్యాయి.

విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంపొందింపజేసి ప్రయోగశాలల్లో నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు పీఎంశ్రీ ద్వారా పాఠశాలల్లో వివిధ రకాల వసతులు కల్పించనున్నారు. పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబొరేటరీలతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వృత్తి విద్యా కోర్సులు అందించనున్నారు.
జాతీయ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ఆధునిక విద్యకు కేంద్రాలుగా పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో జిల్లాలో ఎంపిక చేసిన 21 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 40 శాతం నిధులు జోడించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 21 పాఠశాలలకుగాను 17 పాఠశాలల పరిధిలో అవసరమైన సదుపాయాల కల్పనపై అంచనాలు సిద్ధం చేశారు.

ఆధునిక సదుపాయాలు..
పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలకు నూతన భవన నిర్మాణాలను చేపట్టడంతోపాటు టాయిలెట్లు, గ్రంథాలయం, సౌర విద్యుత్‌ వ్యవస్థ, పాఠశాలల ప్రాంగణాల్లోనే కాయగూరలు, ఆకుకూరల సాగు, కాలుష్యానికి తావు లేని విధంగా గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌తో నిర్మాణాలు ఉండాలనే నిబంధన విధించింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, డిజిటల్‌ లైబ్రరీ, క్రీడల్లో ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని రకాల క్రీడా సామగ్రిని అందించనుంది.
కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడతారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో పీఎంశ్రీ కింద దరఖాస్తు చేసుకున్న పాఠశాలల నిర్వహణలో విద్యాశాఖతోపాటు స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. నిధుల వినియోగంపై పక్కాగా ఆడిట్‌తో పాటు మంజూరు చేసే నిధులను కాంపొనెంట్స్‌ వారీగా ఖర్చు చేయాల్సి ఉంది.

YS Jagan Mohan Reddy: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి

క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో తరగతుల నిర్వహణ
పీఎంశ్రీ ద్వారా ఎంపికై న పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న కంప్యూటర్ల ద్వారా క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని కనెక్ట్‌ చేసి విద్యార్థులకు తరగతులను బోధించాలనే వినూత్న విధానం అందుబాటులోకి రానుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో నిపుణులైన అధ్యాపకులు, ఉపాధ్యాయులచే లైవ్‌ క్లాసెస్‌, వర్చువల్‌ రియాలిటీలో అవగాహన కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు పీఎంశ్రీ పథకం దోహదం జిల్లాలో ఎంపికై న 21 పాఠశాలలు 17 పాఠశాలల్లో వసతుల కల్పనకు అంచనాలు పంపిన అధికారులు ఆధునిక బోధనా వసతులు.. ప్రయోగశాలలకు నిధులు

అంచనాలు సిద్ధం చేసి పంపాం..
జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికై న 21 పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులు, ప్రయోగశాలల ఏర్పాటుపై అంచనాలు సిద్ధం చేయించాం. వీటిలో 17 పాఠశాలలకు సంబంధించిన అంచనాలను ఉన్నతాధికారులకు పంపాం. పాఠశాలల వారీగా సమగ్ర వివరాలతోపాటు, క్రీడా స్థలం, తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాం. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తాం. – జి.విజయలక్ష్మి, ఏపీసీ, సమగ్ర శిక్ష, గుంటూరు 

 

Jaya Jaya He Telangana: రాష్ట్ర గీతంగా ‘జ‌య‌ జ‌య‌హే తెలంగాణ‌’..

#Tags