Indian Polity Notes for Groups: రాజ్యాంగ ప్రవేశిక–తాత్విక పునాదులు

Indian Polity bit bank: రాజ్యాన్ని మతం నుంచి వేరుచేయడాన్ని ఏమంటారు?
Indian Polity Notes for Groups

ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఈ పద్ధతి అమెరికా రాజ్యాంగంతో మొదలైంది. భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే ప్రారంభమైంది. ప్రవేశికను ‘పీఠిక’, ‘అవతారిక’, ‘ముందుమాట’, ‘ఉపోద్ఘాతం’ వంటి పర్యాయపదాలతో వాడుతారు. ప్రవేశికను ఆంగ్లంలో Preamble అంటారు.
ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వాన్ని సూచనప్రాయంగా తెలియచేస్తుంది. రాజ్యాంగాన్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారో, ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించదలచుకున్నారో, మొదలైన అంశాలను స్పష్టీకరిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ముందుమాటగా తెలియచేస్తారు.

చ‌ద‌వండి: Indian Polity Study Material: భారత రాష్ట్రపతి

ప్రవేశిక–ఆధారం

ప్రపంచంలో ప్రవేశికను కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి తీసుకున్నప్పటికీ.. అందులోని లక్ష్యాలకు రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ డిసెంబర్‌ 13, 1946న రచించి ప్రతిపాదించిన ‘‘ఆశయాల తీర్మానం’’ (Objective Resolution) ప్రధాన ప్రాతిపదిక అవుతుంది. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి ‘స్వేచ్ఛ’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతృత్వం’, ‘గణతంత్రం’ అనే పదాలు తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి ఛార్టర్‌లోని ప్రవేశిక కూడా ఆధారంగా చెప్పవచ్చు.
75 సంవత్సరాల ఆజాదీకా అమృతోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా గోడల మీద ప్రవేశికను రాసి పెట్టాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా ప్రవేశికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో ప్రారంభించారు. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ సెంటర్‌ హాల్లో ప్రవేశికను చదివారు.

ప్రవేశిక–పదజాలం, భావాలు, అర్ధవివరణ

భారత రాజ్యాంగ ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్ధాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘‘భారత ప్రజలమైన మేము’’ అంటూ.. ప్రవేశిక ప్రారంభమవుతుంది. ‘ప్రజలే రాజకీయ అధికారానికి మూలం, ప్రజలే రాజ్యాంగం రచించడం జరిగింది’ అని దీని అర్థంగా చెప్పవచ్చు.

రాజకీయ స్వభావాన్ని తెలియచేసే పదాలు

భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పర్చుకుంటుందో, దాని స్వభావం ఏమిటో ప్రవేశికలో స్పష్టంగా పేర్కొన్నారు.

సార్వభౌమత్వం (Sovereignty)

అంటే.. సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా (External Independence and Internal Supremacy) విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తి మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.

చ‌ద‌వండి: APPSC/TSPSC Groups Exams: పాలిటీ నుంచి 25-30 ప్రశ్నలు... పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత, ప్రశ్నల స్థాయి–సరళి!​​​​​​​

సామ్యవాదం (Socialist)

ఈ పదాన్ని 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను(Land, labour and capital ) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా.. సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించకుండా సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం.. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవటానికి అవసరమైన తోడ్పాటును అందించడం జరుగుతుంది.

లౌకిక తత్వం (Secular)

ఈ పదాన్ని కూడా 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే.. మత ప్రమేయం లేని రాజ్యం. అధికార మతం ఉండదు. మత వివక్షత ఉండదు. మతం విషయంలో పౌరులకు స్వేచ్ఛ,సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కానీ, నష్టం కానీ వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మత స్వామ్య రాజ్యము లేదా Theoc-ratic State అంటారు. ఉదా:పాకిస్థాన్‌ , బంగ్లాదేశ్‌.

ప్రజాస్వామ్యం (Democracy)

ప్రజాస్వామ్యం అంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వం, అనగా Government of the people, for the peop-le, by the people అని..ప్రజలే పాలితులు, పాలకులు (People are the rulers and ruled) అని అబ్రహం లింకన్‌ చక్కటి నిర్వచనం చెప్పాడు.
భారతదేశంలో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షత లేకుండా కేవలం నిర్ణీత వయసు ఉన్న పౌరులందరికి ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీచేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా జరుగుతుంది (Rule of law). చట్టబద్దత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు సాధారణంగా ఇవ్వడం జరగదు.
రాజకీయ ప్రజాస్వామ్యంతోపాటు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించాలని.. లేకుంటే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ పేర్కొన్నారు.

గణతంత్రం (Republic)

‘‘గణం’’అంటే ప్రజలు,తంత్రం అంటే పాలన. ఇది ప్రజా పాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ట్రపతి, ఇతర ప్రజా పదవులకు.. ప్రజల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు. బ్రిటీష్‌ రాణి, లేదా రాజుల మాదిరిగా వారసత్వ అధికారం ఉండదు.

సామాజిక ఆశయాలు (Social Objectives)

ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. ఈ రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు.

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

న్యాయం (Justice)

న్యాయం అంటే.. ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్షతలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. మూడు రకాలైన న్యాయాలను ప్రస్తావించారు.

రాజకీయ న్యాయం (Political Justice)

అంటే.. రాజ్య కార్యకలాపాల్లో పౌరులందరూ ఎలాంటి వివక్షతలు లేకుండా పాల్గొనవచ్చు. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైనవి రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.

సామాజిక న్యాయం (Social Justice)

సమాజంలో పౌరులందరు సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా.. అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడం. అన్ని రకాల సామాజిక వివక్షతలను రద్దు చేయడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం.

ఆర్ధిక న్యాయం (Economic Justice)

ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు›కల్పించడం,పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. జీవితాన్ని జీవించేందుకు అనువుగా మార్చడం. సామాజిక,ఆర్థిక న్యాయ సమన్వయాన్ని వితరణశీల న్యాయమంటారు. 

ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty)

నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అంటే.. నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా, పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో,భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదా.. మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్య స్థాపనకు పునాది.

సమానత్వం (Equality)

ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం.. సమానత్వం. సమానత్వం అంటే.. అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి.. ప్రతి వ్యక్తి తనను తాను పూర్తిగా వికాస పరచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.

చ‌ద‌వండి: Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు..

సౌభ్రాతృత్వం (Fraternity)

సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షతలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్థిల్లుతుంది. జాతి, మతాలకు అతీతంగా ప్రజలు వ్యవహరించాలి. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సౌభ్రాతృత్వం అనే భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించారు. 

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సంబంధం

 స్వేచ్ఛను సమానత్వం నుంచి వేరుచేయలేం. అదేవిధంగా సమానత్వం నుంచి స్వేచ్ఛను విడదీయలేం. అలాగే స్వేచ్ఛ, సమానత్వం అనేవి సౌభ్రాతృత్వం నుంచి∙వేరుపడలేవు అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వ్యాఖ్యానించారు.

ఐక్యత, సమగ్రత (Unity & integrity)

ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండడానికి దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం.మత, కుల, ప్రాంత వంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. ‘సమగ్రత’అనే పదాన్ని1976లో,42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.

సమగ్రతను చేర్చవలసిన ఆవశ్యకత

1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్‌ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘సమగ్రత’ అనే పదాన్ని ప్రవేశికలో చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

ప్రవేశిక సవరణకు అతీతం కాదు

ప్రకరణ 368ను అనుసరించి ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం కిందికి వస్తుంది. కాబట్టి దాని సారాంశం (Spirit) మార్చకుండా.. ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. దీంతో స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’, ‘సమగ్రత’ అనే పదజాలాన్ని చేర్చారు. 

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా?–వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు

రాజ్యాంగ సారాంశం అంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్‌ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదని పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం–సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. 1973లో కేశవానంద భారతి కేసులో.. పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ.. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని వ్యాఖ్యానించింది.1995లో ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినపుడు కూడా డా.రాజేంద్రప్రసాద్‌ ‘‘ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని’’ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.

–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌


టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

​​​​​​​​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags