TSPSC: గ్రూప్‌ 2... పేపర్‌–4లో ఏయే అంశాలు ఉంటాయో తెలుసా..?

గ్రూప్‌ 2... పేపర్‌–4 కోసం అభ్యర్థులు మరింత ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రూప్‌–2లో నాలుగో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ (1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.

ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం– 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

ఒకట్రెండు పుస్తకాలు చాలు...
అభ్యర్థులు ముందుగా సిలబస్‌ అంశాలపై పూర్తి స్పష్టత తెచ్చుకోవాలి.ఆ తర్వాత  సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్న ఒకట్రెండు పుస్తకాలను ఎంచుకోవడం మేలు చేస్తుంది. అకాడమీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

సమగ్ర అధ్యయనం అవ‌స‌రం....
గ్రూప్‌–2 పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. కాని అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో చదువుతూ ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ... సమగ్రంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా అన్వయ దృక్పథాన్ని పెంచుకోవాలి.

సొంత నోట్స్ రాసుకోవాలి...
ప్రిపరేషన్‌లో భాగంగా పలు పేపర్లలో ఉమ్మడిగా ఉన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదవడం అనుకూలిస్తుంది. జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదువుకోవాలి. దీంతోపాటు ప్రిపరేషన్‌ సమయంలోనే ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా సొంత నోట్సు రాసుకోవాలి.

#Tags