TSPSC: గ్రూప్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌పై ఐడియా ఉందా.?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు అన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ స్టడీస్ పరిధిలోకి వచ్చే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీల్లోని అన్ని అంశాలపై పట్టు సాధించాలి. తెలంగాణ ప్రాంతంలోని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ సాగించాలి.
చరిత్ర చదివేటప్పుడు భారతదేశ చరిత్రతోపాటు, తెలంగాణ చరిత్రలోని ముఖ్యాంశాలుగా పేర్కొనే శాతవాహనులు, కాకతీయులు తదితర రాజవంశాల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి.
పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, సవరణలు, రాజ్యాంగ సంస్థలు–వాటి విధుల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం నుంచి తెలంగాణ ప్రత్యేకంగా ఉండే అంశాలు తక్కువే. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమైన సంస్థల ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి సంస్థలుగా ఉన్న వాటి విభజన–అందుకు పరిపాలన పరంగా ఉన్న అధికారాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
తెలంగాణ ప్రాంతం గురించి మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థ అంశాలు బాగా చదవాలి.
ఎకానమీ కోసం తెలంగాణపై ప్రత్యేక దృష్టితో ప్రిపరేషన్ సాగించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి చేయూతనిచ్చే రంగాలపై అవగాహన అవసరం. పంటలు–దిగుబడి, తాజా ఆర్థిక సర్వేలో ఈ ప్రాంతం గురించి పేర్కొన్న ముఖ్య అంశాలన్నింటిపైనా దృష్టి సారించాలి.
జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కోర్ కోసం బేసిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు ఔపోసన పట్టాలి. పుస్తకాల్లో బేసిక్‌గా భావించే విటమిన్లు–వ్యాధులు వంటి అంశాల నుంచి తాజా అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ స్టడీస్‌లో పట్టు కోసం అభ్యర్థులు ముందుగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదివి బేసిక్స్‌పై స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని పుస్తకాలను చదవడంతోపాటు, వాటిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విశేషాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటితోపాటు కరెంట్ అఫైర్స్‌కోసం తెలంగాణ మ్యాగజీన్ చదవడం ఎంతో ఉపకరిస్తుంది.