TGPSC Group 1 Mains: గ్రూప్‌–1 మెయిన్స్‌పై పట్టువీడని సర్కారు, అభ్యర్థులు.. అభ్యర్థుల ఆందోళన ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: .. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది.

జీవో 29 కారణంగా రిజర్వుడ్‌ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ అక్టోబర్ 20న నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ చౌరస్తాలో బైఠాయించినా.. గాంధీభవన్‌ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్‌మీట్‌ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. 

ప్రతిపక్షాల మద్దతుతో.. 

ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. ఇక బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పందించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు సుప్రీంకోర్టులో విచారణ 

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.  

#Tags