Children's Rights in India : పిల్ల‌లు మీకు తెలుసా.. మన దేశంలో మీకు ఉన్న‌ హక్కులు ఇవే..

మన దేశ మాజీ ప్రధాన మంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ నవంబర్ 14వ తేదీన‌ జయంతి అన్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాలబాలికల విద్యను ప్రొత్సహించడంతో పాటు వాళ్ల హక్కుల కోసం పాటుపడ్డారు.

అందుకే పిల్లలు ఆయన్ని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. అలా.. ఆయనకు, ప్లిలలకు మధ్య ఉన్న బంధానికి గుర్తుగా.. పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రతీ యేటా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. ఐక్యరాజ్య సమితి మాత్రం నవంబర్‌ 20ను అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. కానీ, మనం మాత్రం నెహ్రూ పుట్టిన రోజు తేదీనే బాలల దినోత్సవంగా(బాల దివాస్‌) నిర్వహించుకుంటున్నాం. 
బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి.. ఇదీ బాలల దినోత్సవం నాడు ప్రభుత్వాలు చేపట్టే చర్యలు. అలాగే పిల్లలకు కొన్ని హక్కులు ఉంటాయి. చాలామందికి పిల్లలకు హక్కులు ఉంటాయని వినడమేగానీ.. అవేంటన్నది మాత్రం తెలియదు. బాలల దినోత్సవ లక్ష్యాల్లో ఒకటైన వాటి గురించి తెలుసుకుందాం.. 

భారత రాజ్యాంగంలో బాలబాలికల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని ఆర్టికల్స్‌(అధికరణలు) ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. 

☛ ఆర్టికల్‌ 15 (3).. స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి చట్ట సభలకు అధికారం ఉంది. ఈ అధికరణ ప్రకారం.. ఏదీ అడ్డురాదు. 
☛ ఆర్టికల్‌ 21(A)..  6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించాలి. భారత రాజ్యాంగంలో 45వ అధికరణ బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. దీనిని అమలు చేయడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని 21-A  అధికరణగా పేర్కొన్నారు. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు అన్నమాట. 
☛ ఆర్టికల్‌ 24 ప్రకారం.. ఫ్యాక్టరీలు, గనుల్లోనూ 14 సంవత్సరాల వయసులోపు పిల్లలతో పని చేయించడానికి వీల్లేదు
☛ ఆర్టికల్‌ 23 (1)..(2014లో చేసిన సవరణలను కలుపుకుని) మనుషులతో క్రయవిక్రయాలు జరపడం, అడుక్కోవడం లేదంటే మరేయితర రూపంలో బలవంతంగా పని చేయించుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు
☛ ఆర్టికల్‌ 39(E) : ఆర్థిక అవసరాలు, ఇతరత్రా పరిస్థితులు.. ఇలా గత్యంతర లేని కొన్ని పరిస్థితుల్లో పిల్లలు తమ శక్తికి మించి పనిచేస్తుంటారు. ఇలాంటివి ప్రోత్సహించరాదు. ఇది పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా వర్తిస్తుంది
☛ ఆర్టికల్‌ 39-(F) : బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా ఉండాలి. బాలల కోసం గౌరవప్రదమైన స్వేచ్ఛాయుత పరిస్థితుల్ని, వివిధ సౌకర్యాల్ని కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలి.
☛ ఆర్టికల్‌ 45 ..  ఆరు నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యనందించాలి
☛ ఆర్టికల్‌ 51A(K): 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. (ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక విధుల్లో చేర్చారు)
☛ ఆర్టికల్‌ 350-A .. భాషా పరమైన మైనార్టీల బాలలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి.

బాలల సంక్షేమానికి తెచ్చిన చట్టాలివి.. 

▶ బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం – 1956 : బాలికల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్ని చేయించడం, బాలికల్ని అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం.
▶ బాలల చట్టం – 1960 : కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అనాథ బాలలు తప్పుదోవ పట్టిన బాలలు, తల్లిదండ్రులు విస్మరించిన, దుష్పప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సరైనమార్గంలో పెట్టడం, వారి సంక్షేమానికి, ఉన్నతికి సరైన విద్య, శిక్షణ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం
▶ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్‌(సంరక్షకుల మరియు పర్యవేక్షకుల చట్టం) –1890 : బాలలకు సంరక్షకుడు ఉన్నప్పుడు .. వాళ్ల సంక్షేమం ఆ గార్డియన్స్ పూర్తి బాధ్యత

▶ బాలకార్మికులు నిషేధ చట్టం – 1986 : 14 ఏండ్లలోపు బాలబాలికల్ని ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయించడం నిషేధం
▶ న్యాయసేవల చట్టం – 1987 (Legal services authority Act – 1987) : బాలలకు కావల్సిన న్యాయపరమైన సేవల అందజేత
▶ శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లయ్ చట్టం 1992 : శిశువులకు కావల్సిన తల్లిపాలకు ప్రత్యామ్నాయ పౌష్టికాహారం అందజేసేందుకు.
▶ శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994 : గర్భస్త దశలో ఉన్న శిశువు ఆడ, మగా నిర్ధారించే స్కానింగ్ పరీక్షలు ఈ చట్టం నిషేధిస్తుంది
ఆరు నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించడానికి 2009లో భారత పార్లమెంట్ చట్టం చేసింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఆర్టికల్‌ 21 (A) గుర్తించింది.
▶ జువైనల్ జస్టిస్ చట్టం – 2000 : బాల నేరస్తుల రక్షణ, బాగోగులు చూడటం
▶ బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 : 1929లో బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో రద్దు చేసి దాని స్థానంలో నూతన బాల్యవివాహ నిరోధక చట్టం – 2006 రూపొందించారు.

హక్కులు.. 
➤ మనుగడ హక్కు
➤ విద్యా హక్కు
➤ రక్షణ హక్కు
➤ యువగొంతుకలకు సాధికారత కల్పించేందుకు.. ఎందులోనైనా పాల్గొనేందుకు హక్కు
➤ అభివృద్ధి హక్కు: సంపూర్ణ వృద్ధిని పెంపొందించడం కోసం
➤ ఆరోగ్యం& శ్రేయస్సు హక్కు: ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం..
➤ వ్యక్తిత్వ గుర్తింపు హక్కు
➤ సృజనాత్మకతను పెంపొందించే క్రమంలో.. వ్యక్తీకరణ హక్కు
➤ సమానత్వాన్ని ప్రొత్సహించే క్రమంలో..  వివక్షకు వ్యతిరేకంగా హక్కు
➤ సురక్షిత పర్యావరణ హక్కు.. రేపటి ప్రపంచ సంరక్షణ కోసం

కింద పేర్కొన్న చట్టాలు బాలల్ని, ఫ్యాక్టరీలలో పనిచేయడం నిషేధిస్తున్నాయి.
➤ ఫ్యాక్టరీస్ చట్టం – 1948
➤ ప్లాంటేషన్ లేబర్ చట్టం – 1951
➤ మర్చంట్ షిప్పింగ్ చట్టం – 1951
➤ మైనింగ్ చట్టం – 1952
➤ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కింగ్ చట్టం – 1961
➤ అప్రెంటీస్ చట్టం – 1961
➤ బీడీ, సిగార్స్ వర్కర్స్ చట్టం – 1966

➤ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ – 2005 : రాజ్యాంగం పార్లమెంట్ బాలలకు కల్పించిన ప్రత్యేక హక్కులు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించే సంస్థ ఇది. బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి న్యాయం అందించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఈ కమిషన్ అవకాశం కల్పిస్తుంది.

➤ లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం – 2012 (Protection of children from sexual ofference 2012) : బాలలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఈ చట్టం శిక్షిస్తుంది. ఇలాంటి కేసులను సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.

ఇవేగాకుండా.. ఐపీసీ, సీఆర్‌పీసీ, హిందూ వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టం.. తదితరాలు కూడా బాలల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్లను కలిగి ఉన్నాయి.

➤ Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?

#Tags