G20 Summit: భారత్‌ అసాధారణ విజయం

రష్యా అధ్యక్షుడు లేడు. చైనా అధినేత రాలేదు. ఉక్రెయిన్‌పై సాగుతున్న రష్యా యుద్ధంపై సభ్య దేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
G20 Summit

ఒక్కముక్కలో జీ20లో దేశాలు ఏకాభిప్రాయంతో కానీ, ఏక లక్ష్యంతో కానీ ఉన్నట్టు కనిపించదు. అయినా సరే, ఆదివారం ఢిల్లీలో ముగిసిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సును ఘనంగా నిర్వహించి, అన్ని దేశాల తరఫునా ఎవరినీ నొప్పించని 83 పేరాల ఏకాభిప్రాయ ప్రకటన, అదీ ఒకరోజు ముందరే చేయించడమనేది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌కు అసాధారణ విజయమే!

G-20 Summit: G20 ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారో తెలుసా!

దక్షిణార్ధగోళంలోని వర్ధమాన, పేదదేశాల పక్షాన నిలబడి, వాటి ప్రయోజ నాల్ని సదస్సు అజెండాలో మేళవింపజేయడమూ సామాన్యం కాదు. అలాగే బాలీలో నిరుడు అంగీ కరించినదే అయినా, ఆఫ్రికన్‌ యూనియన్‌ (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణార్ధగోళానికి తాను సరైన ప్రతినిధినని భారత్‌ చాటుకున్నట్టయింది. అందుకే, వంతుల వారీగా ఏడాదికొకరికి వచ్చే అధ్యక్షహోదాయే అయినా... జీ20 సారథిగా భారత్‌ సక్సెస్‌ కావడం, ప్రపంచ వేదికలో మరో మెట్టు పైకి ఎక్కడం కచ్చితంగా సంతోషించదగ్గ సమయం, సందర్భం. 
జీ20 సదస్సు ముగింపు వేళ చేసిన ఏకాభిప్రాయ ప్రకటనపై కొన్ని అసంతృప్తులూ లేకపోలేదు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్న రీతిలో రష్యాను నిలదీయ లేదనీ, నిరుటి బాలీ డిక్లరేషన్‌ నుంచి పక్కకు జరిగారనీ ఒక వర్గపు అసంతృప్తి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా మానుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం స్థిరసంకల్పం, చిత్త శుద్ధి లేమిని తెలియజేస్తోందన్నది మరో ప్రధానమైన అసంతృప్తి.
జీ20 సదస్సులు ఆయా ఆతిథ్య దేశాల ఘనత చాటుకోవడానికే తప్ప, అసలు పనిలో తూతూమంత్రంగా మారాయనే నింద కొంత కాలంగా ఉన్నదే. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత జీ20 వేదికదే! తాజా జీ20 లోనూ ప్రకటించిన లక్ష్యాలు బలహీనంగా ఉన్నాయనీ, ఇప్పటికే తాము కట్టుబడిన లక్ష్యాలనే దేశాధి నేతలు వల్లెవేశారని విశ్లేషకుల మాట. వెరసి, నిర్వహణలో పేరుప్రఖ్యాతులతో ఇండియా హిట్టే కానీ, కీలక ప్రపంచ సమస్యలపై నిర్ణయంలోనే సదస్సు విఫలమైందనే మాట మిగిలిపోయింది. 

G-20 Summit: విశ్వ శ్రేయస్సుకు జి–20

చర్చించడానికి ఆహారభద్రత, ఋణాల ఉపశమనం, పర్యావరణ సంక్షోభం, వ్యాధులు, బ్యాంకింగ్‌ సంస్కరణలు, డిజిటల్‌ ప్రాథమిక వసతుల లాంటి అనేక ప్రపంచ సమస్యలున్నాయి. కానీ, వాటి పరిష్కారానికి అందరికీ అంగీకారయోగ్యమైన, విశ్వసనీయ కార్యాచరణ జీ20లో లోపించింది. పరస్పర భిన్నమైన 20 దేశాలు సమష్టి ఆశయాలు, ఆలోచనలు, అనుభవాల పునాదిపై కాక ఆర్థిక బలిమి ప్రాతిపదికన ఇలా ఒక వేదికపై చేరడమే అసలు చిక్కు. అందుకే, రానురానూ జీ20 వార్షిక సదస్సు ఫలితాలు ప్రశ్నార్థకమవుతున్నాయి.

నిరుటి బాలీ సదస్సుతో పోలిస్తే తాజా సదస్సులో అగ్ర దేశాల మధ్య చీలికలు పెరిగాయి. దానివల్ల సదస్సు ప్రధాన అజెండా పట్టాలు తప్పకుండా భారత్‌ సంక్లిష్ట దౌత్యవిన్యాసంతో సమతూకం సాధించడం విశేషం. అలాగే, ఉక్రెయిన్‌ వ్యవహారంలో రష్యాపై ఆంక్షల లాంటివి సమర్థించడంలో దక్షిణార్ధగోళానికి సమస్యలున్నాయని పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది. అందుకే, ఆ అంశంపైనే పట్టుబట్టి కూర్చోలేదు. రష్యా కన్నా చైనాతో పెను ముప్పు అని గ్రహించిన అమెరికా చివరకు దక్షిణార్థగోళ దేశాల మాట ఆలకించేందుకు భారత్‌తో నడిచింది. 

G20 Summit: G20 ల‌క్షాలేంటి?

నిజానికి, వరుస ప్రకారమైతే జీ20 సదస్సు మన దేశంలో 2022లో, ఇండొనేషియాలో 2023లో జరగాలి. కానీ, ఇండొనేషియాను మన పాలకులు మెత్తగా ఒప్పించి, ఢిల్లీ స్థానంలో ముందుగా బాలీలో సదస్సు జరిపించారు. సార్వత్రిక ఎన్నికలకు వీలైనంత దగ్గరగా, ఈ ఏడాది మన వద్ద ఈ అంతర్జాతీయ సంబరం జరిగేలా చూడగలిగారు. అదెలా ఉన్నా ఈ సదస్సును దేశానికి గర్వకారణంగా చూపి, సానుకూల ఫలితాల దిశగా మలుచుకోవడంలో మనవాళ్ళు సఫల మయ్యారు. ఏడాది కాలంలో కేంద్ర పాలకులు దేశవ్యాప్తంగా 60కి పైగా పట్నాల్లో, 200కు పైగా సమావేశాలు జరిపారు.

సాధారణంగా సామాన్యులకు సంబంధం లేని వ్యవహారంగా అనిపించే సదస్సును సైతం తెలివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఈ సదస్సు విజయాన్ని వచ్చే ఎన్నికల్లో సహజంగానే మరింత వాడుకుంటారు. అయితే, సహకార సమాఖ్య విధానాన్నీ, ప్రత్యర్థి పక్షాల మధ్య ద్వైపాక్షికతనూ నమ్మడం వల్లే ఈ సదస్సు ఘనత సాధ్యమైందని సర్కారు వారి మాట. దేశంలోని ప్రతిపక్షాలను కలుపుకొనిపోని వారి నోట ఈ మాట రావడం విడ్డూరమే. సహకార సమాఖ్య లాంటివి పెద్దలు నిజంగా నమ్ముతున్నదీ లేనిదీ నవంబర్‌ చివర 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ నియామకం, సంఘం నియమావళి ఖరారు వేళ తెలుస్తుంది.

G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు

ఏమైనా, ఐరాస సర్వప్రతినిధి సభ దాదాపు అచేతనంగా మారిన పరిస్థితుల్లో జీ20 మరింత చొరవ తీసుకోవాలని పరిశీలకుల భావన. అందుకే, ఉక్రెయిన్‌ యుద్ధ సమస్యలు, పర్యావరణ సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలపై చర్యలు చర్చించకుండానే సదస్సు ముగిసిపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. కానీ, సభ్యదేశాల మధ్య సంక్లిష్టతలతో ఆ ఘనత ఒక్క భారత్‌ చేతు ల్లోనూ లేదని గ్రహించాలి.

మొత్తం 19 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌తో కూడిన జీ20 తాజా ఆఫ్రికన్‌ యూనియన్‌ చేరికతో వచ్చే 2024లో బ్రెజిల్‌ సదస్సు నాటికి జీ21గా పలకరించనుంది. ఆ పై ఏడాది దక్షిణాఫ్రికాలో సమావేశం కానుంది. భారత్‌ అధ్యక్షతన సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్ళడానికే కాదు, అంతర్జాతీయంగా జీ20 ప్రాసంగికతను నిలపడానికీ ఆ రెండు సదస్సులూ కీలకం. ఇప్పటికైతే, ఇండొనేసియా, జర్మనీల కన్నా అనేక రెట్ల ఖర్చుతో ఢిల్లీ సదస్సు జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, ‘విశ్వగురువు’ ప్రచారం మరింత ఊపందుకున్నందుకు సంబరపడాలి. 

Delhi Declaration Approved: జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం

#Tags