Skip to main content

EVM Row: 'ఈవీఎం'లు వద్దు.. పేపర్‌ బ్యాలెటే ముద్దు.. అంటున్న దేశాలివే..

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్‌ బ్యాలెట్‌నే వాడుతున్నాయి.
List Of Countries Banned EVMs Elections Through Paper Ballot

ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్‌ బ్యాలెట్‌, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్‌లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో తెలుసుకుద్దాం.   

➤ ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్‌ బ్యాలెట్‌ పద్దతినే అవలంభిస్తున్నాయి.  

➤ పిలిఫ్పైన్స్‌, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్‌, ఇటలీ, కజకస్థాన్‌, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.

➤ భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.

➤ జర్మనీ, నెదర్లాండ్స్‌, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

➤ 2006లో నెదర్లాండ్స్‌ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్‌, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్‌ చేశాయి. బ్యాలెట్‌ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 

➤ సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.

➤ అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్‌ లేదంటే ఫ్యాక్స్‌ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్‌, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.

➤ 2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

➤ ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్‌‌, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్‌ డిజిట్‌లోపు‌ మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 

➤ భూటాన్‌, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 

Satellites: ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?

➤ ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్‌ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు.

Published date : 18 Jun 2024 05:41PM

Photo Stories