Skip to main content

Union Council of Ministers: తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు ఇవే..!

తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురు విరే..
Characteristics of the post of Union Council of Ministers

‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి 
నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్‌ నేత ‘మామ’ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్‌ఎస్‌ఎస్‌లో వాలంటీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బంపర్‌ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.

నడ్డా.. వివాదాలకు దూరం    
బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.

మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం  
గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్‌ రఘునాథ్‌ పాటిల్‌కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజార్టీ సాధించారు. మహారాష్ట్రలో జన్మించిన పాటిల్‌ గుజరాత్‌లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్‌గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్‌ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.

బిహార్‌ దళిత తేజం..
లోక్‌జనశక్తి పార్టీ(రామ్‌విలాస్‌) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తన తండ్రి, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్‌లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్‌ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్‌ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్‌ నటి కంగానా రనౌత్‌ కావడం విశేషం. చిరాగ్‌కా రోజ్‌గార్‌ సంస్థ ద్వారా బిహార్‌ యువతకు ఉపాధి కల్పించేందుకు చిరాగ్‌ కృషి చేస్తున్నారు.

Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..

యాక్షన్‌ హీరో మాస్‌ ఎంట్రీ  
ప్రముఖ మలయాళ యాక్షన్‌ హీరో 65 ఏళ్ల సురేశ్‌ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్‌ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్‌కు పట్టున్న త్రిసూర్‌ లోక్‌సభ స్థానంలో 2019 లోక్‌సభ‌, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్‌ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్‌ గోపి.
 
బిహార్‌ ఈబీసీ నేత..  
ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్‌ కుమారుడైన రామ్‌నాథ్‌ ఠాకూర్‌ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్‌నాథ్‌ 2014 ఏప్రిల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్‌ రెండు సార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ప్రతాప్‌ జాదవ్‌..
64 ఏళ్ల జాదవ్‌కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్‌సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.

ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..
సంజయ్‌ సేథ్‌ (64) జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్‌ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్‌ బోర్డు చైర్మన్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నేత సుబోధ్‌ కాంత్‌ సహాయ్‌ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు.

గిరిజన నేత ఉయికె..
మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్‌ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్‌(ఎస్‌టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్‌లో ఈయన టీచర్‌గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. 

రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రి
మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్‌ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!

వీరేంద్ర కుమార్‌..
మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత వీరేంద్ర కుమార్‌(70). ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్‌ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్‌డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్‌పై తిరుగుతూ సైకిల్‌ రిపేర్‌ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.

Foreign Leaders: మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన‌ 7 దేశాల అధినేతలు వీరే..

మాంఝీకి దక్కిన ఫలితం
బిహార్‌ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్‌ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా(సెక్యులర్‌) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్‌ కుమార్‌ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్‌జేడీ, జేడీయూల్లో సాగింది.

టంటా.. ఉత్తరాఖండ్‌ సీనియర్‌ నేత
ఉత్తరాఖండ్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ ఎంపీ అజయ్‌ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్‌పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్‌టైల్స్‌ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.

ఖట్టర్‌.. ప్రచారక్‌ నుంచి కేంద్ర మంత్రి 
1977లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్‌ సింగ్‌ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్‌తక్‌ జిల్లా నిందానలో స్థిరపడింది.

ఓరం.. ఒడిశా గిరిజన నేత
63 ఏళ్ల జువల్‌ ఓరమ్‌ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్‌పేయీ కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్‌గా చేశారు.

రాజీవ్‌ రతన్‌ సింగ్‌ ‘లలన్‌’
లలన్‌ సింగ్‌గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్‌లో పలుకుబడి కలిగిన భూమిహార్‌ వర్గానికి చెందిన నేత.  నితీశ్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్‌ కుమార్‌ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్‌ చేశారు.

జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగా..
ఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ధార్‌ లోక్‌సభ నియోజకవర్గం(ఎస్‌టీ)నుంచి సావిత్రీ ఠాకూర్‌(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్‌ మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాధేశ్యామ్‌ మువెల్‌పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

List of Central Ministers: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం ఇదే..

రెండుసార్లు భావ్‌నగర్‌ మేయర్‌..
తాజా లోక్‌సభకు గుజరాత్‌ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్‌ బంభానియా(57) ఒకరు. భావ్‌నగర్‌ నుంచి ఆప్‌ అభ్యర్థి ఉమేశ్‌ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్‌నగర్‌ మేయర్‌గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్‌ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.

సినీ నిర్మాత.. రాజకీయ నేత
రెండు సాంస్కృతిక మేగజీన్‌లకు ఎడిటర్‌గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49).. అస్సామీస్‌ ఫీచర్, షార్ట్‌ ఫిల్మ్‌లను నిర్మించారు. జున్‌బాయ్‌ సిరీస్‌తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్‌ ఫిల్మ్‌ ‘మొన్‌ జాయ్‌’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Published date : 11 Jun 2024 09:08AM

Photo Stories