Skip to main content

Longest Serving Lok Sabha Members: లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచింది వీరే..!

తొలిసారి లోక్‌సభ ఎన్నికలు 1952లో జరిగాయి.
These Leaders have the Record of Winning Lok Sabha Elections

ఇప్పటి వరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 

కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచింది వీరే..
ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): 
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్‌జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.

సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):
1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.

పీఎం సయీద్ (10 సార్లు):
పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి(9 సార్లు):
మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

India First General Elections: ఎన్నికల ఆరంభం అదిరింది.. తొలి సాధారణ ఎన్నికల్లో ఎటు చూసినా సవాళ్లే!!

కమల్ నాథ్: 
లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్‌నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.

మాధవ్ రావ్ సింధియా: 
దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ఓడించారు.

ఖగపతి ప్రదాని: 
ఒడిశాలోని నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

These Leaders have the Record of Winning Lok Sabha Elections

గిరిధర్ గోమాంగ్: 
కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.

రామ్‌విలాస్‌ పాశ్వాన్‌: 
తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ పేరుంది. రామ్ విలాస్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.

Election Ink: చెరిగిపోని సిరా చుక్క.. దీని వాడకం మొదలైంది ఎప్పుడంటే..

జార్జ్ ఫెర్నాండెజ్: 
లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.

బాసుదేబ్ ఆచార్య: 
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

మాణిక్‌రావ్ హోడల్యా గవిత్: 
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్‌ హోడల్యా గవిత్ లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

వీరంతా ఎనిమిది సార్లు: 
బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్‌సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

Published date : 23 May 2024 10:51AM

Photo Stories