Skip to main content

G20 Summit: G20 ల‌క్షాలేంటి?

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా ఖ్యాతికెక్కిన జీ20 సదస్సుకు హస్తిన ముస్తాబైంది. ఈనెల 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగు తున్నాయి.
G20 Summit, Diplomatic talks among G20 nations ,Global economic and political discussions
G20 Summit

జీ20కి భారత సారథ్య బాధ్యతలు త్వరలో ముగుస్తున్న తరుణంలో ఢిల్లీలో జరిగే సదస్సులో విప్లవాత్మక తీర్మానా లు జరిగే అవకాశముంది. వర్కింగ్‌ గ్రూప్‌ సెషన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల జీ20 మంత్రుల విడివిడి సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీ20 గురించి కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం.

G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు

ఈసారి ఇతివృత్తమేంటి ?

వసుధైక కుటుంబం అనేది ఈ ఏడాదికి జీ20 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబం జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం.

భూమిపై మనగడ సాగిస్తున్న జీవజాలం మధ్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సహాహారమే వసుధైక కుటుంబం అని చాటిచెపుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్‌(లైఫ్‌ స్టైల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌).. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సు ద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు అభిలషిస్తోంది. ‘లైఫ్‌’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది.

G20 Summits: జి20 సదస్సులు.. ఢిల్లీ లాక్ డౌన్

జీ20 సారథ్య బాధ్యతలను ఎలా నిర్ణయిస్తారు?

19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రపంచం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. జీ20లో అంతర్గతంగా ఐదు గ్రూప్‌లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌ నుంచి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడొచ్చు. ప్రతి సంవత్సరం రొటేషన్‌ పద్ధతిలో ఒక గ్రూప్‌కు సారథ్య బాధ్యతల అవకాశం దక్కుతుంది.
తమ గ్రూప్‌ తరఫున సారథ్య అవకాశం వచ్చినపుడు ఆ గ్రూప్‌ నుంచి ఎవరు ప్రెసిడెన్సీకి పోటీ పడాలనేది అంతర్గతంగా ఆ దేశాలు విస్తృతంగా చర్చించుకుని నిర్ణయించుకుని ఉమ్మడి నిర్ణయం ప్రకటిస్తాయి. అలా తదుపరి సారథి ఎవరో నిర్ణయమైపోతుంది. సారథ్యం వహించే దేశం అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. జీ20 అజెండా ఖరారు, శిఖరాగ్ర సదస్సుసహా మంత్రిత్వ శాఖల స్థాయిలో విడివిడిగా జీ20 గ్రూప్‌ సమావేశాలను వేర్వేరు పట్టణాల్లో నిర్వహించాలి. సమావేశాల తాలూకు అన్ని రకాల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది తరలింపు బాధ్యత సారథ్య దేశానిదే. శాశ్వత సచివాలయం లేని సందర్భాల్లో జీ20 సదస్సు సంబంధ వ్యవహారాలనూ అతిథ్య దేశమే చూసుకోవాలి.

India@2047: 2047 నాటికి అభివృద్ధి భారత్‌

తొలి సదస్సు ఎక్కడ ?

2008 నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా జీ20 ఉద్భవించింది. ఆనాడు యురోపియన్‌ యూని యన్‌కు సారథ్యం వహిస్తున్న ఫ్రాన్స్‌.. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కి ఆర్థికవ్యవస్థ మళ్లీ ఉరకలెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చింది. అప్పటికే జీ8 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికాలు పరిస్థితిని చక్కదిద్దలేకపోయాయి. దీంతో మరిన్ని దేశాలతో కలిపి జీ20ని కొత్తగా ఏర్పాటుచేశారు. ‘ఫైనాన్షియల్‌ మార్కెట్లు– ప్రపంచ ఆర్థికవ్యవస్థ’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగింది.  

Nomore India...only Bharath: భారత్‌ ఒక్కటే నోమోర్‌ ఇండియా...ఒన్లీ భారత్‌

ఈసారి సదస్సుకు ఎవరెవరు వస్తున్నారు?

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌:
పర్యావరణ మార్పులను అడ్డుకుంటూ శుద్ధ ఇంథనం వైపు ప్రపంచ దేశాలను ఎలా నడిపించాలనే అంశంపై ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. బహుళజాతి అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అంశాలపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాన్ని సమీక్షించనున్నారు.

చైనా తరఫున లీ కియాంగ్‌:
ఈసారి సదస్సులో చైనా తరఫున ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రావట్లేదు. ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్‌ వస్తున్నారు.

బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌:
భారత్‌–బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్యం లక్ష్యంగా బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మోదీతో విడిగా భేటీ కానున్నారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌:
ఢిల్లీలోని క్లారిడ్జ్‌ హోటల్‌లో ఈయన బస చేయనున్నారు.

కెనడా ప్రధాని ట్రూడో:
రష్యాతో యుద్ధంలో తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ అంతర్జాతీయ వేదికపై ఈయన ప్రకటన చేయనున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌:
ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోనూ పర్యటిస్తూ ఈయన భారత్‌లో జీ20లో పాల్గొననున్నారు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలూ సదస్సులో పాల్గొంటారు.

Highest Pollution City in the World: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ

రానివారెవ్వరు ?

ఆహ్వానం అందని కారణంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రావట్లేదు. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, జపాన్, ఇటలీ, జర్మనీ, ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనాల అగ్రనేతలు సదస్సుకు రావట్లేదు.

అతిథులు వస్తున్నారు..

అతిథి హోదాలో కొన్ని దేశాల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా ఈ జాబితాలో ఉన్నాయి.
శిఖరాగ్ర సదస్సు మొదలవగానే ఈ భేటీలో అగ్రరాజ్యాధినేతలు ఏమేం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏం వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్సకతతో ఎదురుచూడటం ఖాయం. పెను వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు ఉక్రెయిన్‌ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. సదస్సులో భాగంగా విచ్చేసే దేశాధినేతలు విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు, ఉమ్మడి ప్రణాళికలు చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కనుంది. ఇది ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతో దోహదపడనుంది.

Shiva Shakti Point: శివశక్తిగా చంద్రయాన్‌–3 ల్యాండర్‌ దిగిన ప్రాంతం

Published date : 07 Sep 2023 02:23PM

Photo Stories