Engineering Seats: ఇంజనీరింగ్‌ సీట్ల పెంపునకు హైకోర్టు ఓకే.. కొత్తగా ఇన్ని వేల సీట్లు అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో (పిటిషనర్లు) సీట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొత్తగా 3 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

కన్వీనర్‌ కోటా కింద 2,100, మేనేజ్‌మెంట్‌ కోటా కింద 900 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ సీట్ల కేటాయింపు తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని స్పష్టం చేసింది.
బీటెక్, బీఈలో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు హైకోర్టులో 11 పిటిషన్లు, ఓ మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేశాయి.

చదవండి: Srikushal Yarlagadda: భవిష్యత్తును చెప్పే డెస్టినీ.. ఏఐ యాప్‌ రూపకల్పనలో హైదరాబాదీ.. తల్లి భవితపై ప్రయోగాలు

విద్యా జ్యోతి, ఎంఎల్‌ఆర్, మ ల్లారెడ్డి, సీఎంఆర్, మార్టిన్స్, అనురాగ్, మర్రి లక్ష్మారెడ్డి కాలేజీలు ఈ పిటిషన్లు, మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేశాయి.
కాగా మధ్యంతర అప్లికేషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూల్‌ పూర్తయినందున సీట్ల పెంపు, కొత్త కోర్సులపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తీర్పు చెప్పారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం సెప్టెంబర్ 9న‌ విచారణ చేపట్టింది.  

చదవండి: D Sridhar Babu: ఐటీలో మేటిగా తెలంగాణ.. బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు.. ఈ స్థాయిలో ఏఐ!

వాద ప్రతివాదనలు సాగాయిలా.. 

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, శ్రీరఘురామ్, ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ అనుమతి ఇచ్చిన మేరకు కోర్సుల్లో సీట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలి. జేఎన్‌టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తిరస్కరించడం సరికాదు.
పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకే అనుమతి కోరుతున్నాం. దీంతో ఒక్క సీటు కూడా అదనంగా పెరగడం లేదు. ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎలాంటి కారణం చెప్పకుండానే ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి మాకు అనుమతి నిరాకరించారు.

70 కాలేజీలకు గాను 56 కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చి.. మా కాలేజీల్లో తిరస్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం..’అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. 
కాలేజీలు కోరిన విధంగా సీట్లు పెంచుకుంటూపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది.

సీట్ల పెంపు, విలీనంపై నిర్ణయం తీసుకునే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉంది. సీఎస్‌ఈ లాంటి కోర్సుల్లో ఇప్పటికీ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా పెంచాలని కోరడం సరికాదు. అప్పీళ్లను కొట్టివేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు.  

చదవండి: Free Online Training: ఏఐపై మరింత అవగాహన అవసరం.. ఉచిత శిక్షణకు ఒప్పందం

కోర్టు ఏం చెప్పిందంటే.. 

‘సెప్టెంబర్ 5న మధ్యంతర అప్లికేషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తున్నాం. అప్పీల్‌ దాఖలు చేసిన కాలేజీల్లో పెంచిన సీట్లకు అధికారులు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

ఈ అంశం కోర్టులో ఉందని, తుది తీర్పు మేరకే విద్యార్థుల ప్రవేశం ఉంటుందని స్పష్టంగా కౌన్సెలింగ్‌లో తెలియజేయాలి.
సింగిల్‌ జడ్జి వద్ద అధికారులు రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలి. రిట్‌ పిటిషన్లను త్వరితగతిన విచారణ చేయాలని సింగిల్‌ జడ్జిని కోరుతున్నాం.

సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున మెరిట్‌పై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ప్రధాన పిటిషన్లలోని మెరిట్‌పై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నాం..’అని ధర్మాసనం పేర్కొంది. 

#Tags