AP TET Notification Released- టెట్ నోటిఫికేషన్ విడుదల,పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే 6100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఏపీ టెట్ నోటిపికేషన్ కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 8 నుంచే టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 18 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మాక్ టెస్టుకు అవకాశం, హాల్‌టికెట్స్ ఎప్పుడంటే..
అనంతరం ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
రెండు సెషన్స్‌లో పరీక్ష
మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు టెట్ కీలకం
మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు.11వ తేదీ వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన విడుదల చేస్తారు. మార్చి 14వ తేదీన ఏపీ టెట్ ఫైనల్ ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ పరీక్షల మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉండటంతో డీఎస్సీకు సిద్ధమయ్యే విద్యార్ధులకు టెట్ పరీక్ష కీలకం కానుంది. ఏపీ టెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు.
టెట్ 1 పరీక్షకు రెండేళ్ల డీఎడ్ లేదా నాలుగేళ్ల బీఎడ్ చేసినవారు అర్హులు. ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్ధులకు టెట్ పేపర్ 2 రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 8 నుంచి
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 18 వరకు
ఆన్‌లైన్ మాక్ టెస్టు: ఫిబ్రవరి 19న
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 23 నుంచి
పరీక్ష రుసుము: రూ.750.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
ఫలితాల తేది: 14.03.2024.
అభ్యర్థులు ఏపీ టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.