DSC 2024: కొలువు కొట్టాల్సిందే...! ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉపాధ్యాయ ఖాళీలు ఇలా..

నిర్మల్‌ఖిల్లా: కొన్నేళ్లుగా నిరంతరం పుస్తకాలతోనే కుస్తీ పడుతూ శ్రమిస్తున్న నిరుద్యోగుల చిరకాల స్వప్నం ఉపాధ్యాయ ఉద్యోగం. ఈ కలను సాకారం చేసుకునే తరుణం రానేవచ్చింది.

నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు పరీక్షలు వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నా...పరీక్షలు నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా జారీ చేసింది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నోటిఫికేషన్‌ ప్రకారం 1,295 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా దాదాపు 30 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మెదక్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

రెండో నియామక పరీక్ష

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏడేళ్ల అనంతరం నిర్వహిస్తున్న రెండో నియామక పరీక్ష ఇది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించే పరీక్షకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 29,543 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఒక్కో జిల్లా అభ్యర్థులకు ఒక్కోరోజున ఆయా జిల్లాల వారీగా ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు విడతలుగా నిర్వహించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో తీవ్ర పోటీ ...

గత ప్రభుత్వం 2023లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా అందులో పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మ రిన్ని పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని బీఈడీ, డీఈడీ, తదితర ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసుకుని టెట్‌ అర్హత సాధించిన దాదాపు 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తులు చేసుకున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో 9,569, నిర్మల్‌ జిల్లాలో 6,035, మంచిర్యాల జిల్లాలో 8,262, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 5,677 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిపరేషన్‌ కోసం మరింత సమయం కేటాయించాలని, మరిన్ని ఖాళీలను జత చేసిన అనంతరమే పరీక్షలు నిర్వహించాలని డిమా ండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పరీక్షలు కచ్చితంగా నిర్వహించి తీరుతామంటూ కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది.

జూలై 18 నుంచి జిల్లాల వారీగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించింది. హాల్‌టికెట్లు కూడా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దాని ప్రకారం ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ వివిధ సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండ, తదితర ప్రాంతాలకు పరీక్షల సమయంలో అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఒత్తిడికి గురికావొద్దు...

డీఎస్సీ పరీక్షలో ప్రతిప్రశ్న కూడా అత్యంత విలువైనదే. భవిష్యత్‌ను నిర్దేశించే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతీ ప్రశ్నకు అత్యంత జాగ్రత్తగా సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా సమాధానాలు రాబట్టాలి. తెలియని ప్రశ్న వద్ద ఆగిపోకుండా దానిని వదిలేసి ముందుకెళ్లాలి. ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా ఆందోళనకు గురికాకుండా మిగతా వాటికి సమాధానాలు గుర్తించాలి.

– కటకం మురళి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పోటీ పరీక్షల నిపుణులు, నిర్మల్‌

కొలువు సులువు..

పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలి. చదివిన అంశాలన్నీ గుర్తుండాలంటే ఒత్తిడికి లోను కాకుండా ఒక్కో ప్రశ్నకు సమాధానాన్ని చాలా రిలాక్స్‌డ్‌గా గుర్తించాలి. ప్రశ్నను చదివిన వెంటనే తొలిసారిగా మనసులో మెదిలే సమాధానమే కరెక్ట్‌. ప్రణాళికాబద్ధంగా అసందిగ్ధతకు తావులేకుండా ప్రశ్నలకు సమాధానాలను గుర్తిస్తూ పోతే లక్ష్యానికి చేరువవుతాం. అనుకున్న ఉపాధ్యాయ కొలువు సులువుగా చేజిక్కుతుంది.

– శింధే దత్తాద్రి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, 2017 టీఆర్టీ ఉమ్మడి జిల్లా టాపర్‌, భైంసా

పరీక్షకు ఒక రోజు ముందు ఇలా...

ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అభ్యర్థులు ముందు రోజున ప్రిపరేషన్‌ కంటే కూడా పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి.

ముందు రోజు రాత్రి అభ్యర్థులు ప్రశాంతంగా నిద్రపోవాలి. పరీక్ష రోజున నిర్దేశిత సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కేటాయించిన స్థలం, కంప్యూటర్‌ పనితీరు సరిచూసుకుని కూర్చున్న తర్వాత ఇచ్చిన సూచనలకనుగుణంగా ఆన్‌లైన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

తెలిసిన సమాధానాలు గుర్తించిన తర్వాతే ఎలిమినేషన్‌ విధానం ద్వారా సమాధానం ఊహించి మిగతా ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండనుండడంతో 80 మార్కులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 160 ప్రశ్నలుంటాయి.

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉపాధ్యాయ ఖాళీలు, అందిన దరఖాస్తులు

జిల్లా

ఖాళీలు

 దరఖాస్తులు

నిర్మల్‌

342

6,035

ఆదిలాబాద్‌

324

9,569

మంచిర్యాల

288

8,262

ఆసిఫాబాద్‌

341

5,677

మొత్తం

1,295

29,543

తీరనున్న ఉపాధ్యాయుల కొరత...

ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,295 ఉపాధ్యాయ ఖాళీలను ప్రభుత్వం ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రానున్నారు.

ఇటీవల నిర్వహించిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియతో జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఈ డీఎస్సీ ద్వారా ఎంపికయ్యే ఉపాధ్యాయులను వాటిలో భర్తీ చేయడం ద్వారా కొరత తీరనుంది.

#Tags