Chandrayaan-3: చ‌దువుల్లో రారాజులు... చంద్ర‌యాన్ 3లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇవే..!

చంద్రయాన్‌–3 మిషన్‌ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) పేరు మార్మోగిపోతోంది. ప్ర‌పంచ‌మంతా భారత్ వైపు చూస్తోంది. అంత‌రిక్ష రంగంలో మువ్వెన్న‌ల ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించిన శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌జ‌లు స‌లాం కొడుతున్నారు.
చ‌దువుల్లో రారాజులు... చంద్ర‌యాన్ 3లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇవే..!

అయితే చాలామందికి మిష‌న్‌లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు ఏం చ‌దివారు, ఎక్క‌డ చ‌దివారన్న కుతూహ‌లం ఉంది. వారి కోసమే ఈ ఆర్టిక‌ల్‌... 

చంద్రయాన్ 3 దిగ్విజ‌యంగా ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఈ మిషన్‌లో భాగస్వాములైన శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇక్క‌డ తెలుసుకుందాం.! 

గోల్డ్‌మెడ‌లిస్ట్... సోమనాథ్ 
భారత అంతరిక్ష అధ్యయన సంస్థ చైర్ పర్సన్ ఎస్ సోమనాథ్ పై దేశ ప్ర‌జ‌లంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చంద్ర‌యాన్ 3ని విజ‌య‌వంతం చేసిన బ‌`ందానికి ఆయ‌నే నాయ‌క‌త్వం వ‌హించారు. సోమనాథ్... కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్ట్రక్చర్స్, డైనమిక్స్, కంట్రోల్ విభాగాల్లో ఆయ‌న గోల్డ్ మెడల్ సాధించాడు.

ఇవీ చ‌ద‌వండి: మ‌రో మూడు రోజుల్లో సూర్యుడి చెంత‌కు ఆదిత్య... బ‌డ్జెట్ ఎంతంటే..!

డిగ్రీ చేసి ఉన్న‌త శిఖ‌రాల‌కు... 
యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యు.ఆర్.ఎస్.సి) డైరెక్టర్ ఎం.శంకరన్ 1986 లో తిరుచిరాపల్లిలోని భారతిదాసన్ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత యూఆర్ఎస్సీగా పిలిచే ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్ఏసీ)లో చేరారు.

క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్‌...
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా డాక్టర్ వి.నారాయణన్ వ్యవహరిస్తున్నారు. రాకెట్ ప్రొపల్షన్ విభాగంలో నిపుణుడైన ఆయన 1984లో ఇస్రోలో చేరారు. 1989లో ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ ప‌ట్టా పొందారు. ఎంటెక్‌లో ఫ‌స్ట్ ర్యాంకు సాధించారు. ఆ త‌ర్వాత‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి రజత పతకం, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ (హానరిస్ కాజ్) గౌరవ డాక్ట‌రేట్‌ పొందారు.

ఇవీ చ‌ద‌వండి: చంద్రయాన్-3 సూప‌ర్ స‌క్సెస్‌.. వాట్ నెక్ట్స్.. దీని వ‌ల్ల మానవాళికి ఏం లాభం?

ఉన్న‌త చ‌దువుల నాయర్
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ((VSSC) డైరెక్టర్‌గా ఉన్నికృష్ణన్ నాయర్ ఉన్నారు. ఈయ‌న కేరళ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, IISc Bangalore నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంఈ, ఐఐటి మద్రాస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. నల్సార్ నుంచి టెలికమ్యూనికేషన్స్ అండ్ స్పేస్ లాలో ఎంఏ పట్టా పొందారు.  

రైల్వే పాఠశాలలో పాఠశాల విద్య...
చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ గా పి.వీరముత్తువేల్ వ్యవహరిస్తున్నారు. విల్లుపురంలోని రైల్వే పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన పి.వీరముత్తువేల్ ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. త‌ర్వాత‌ చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్, మరో ఇంజినీరింగ్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

ఇవీ చ‌ద‌వండి:  నెట్టింట వైర‌ల‌వుతున్న ఆటోవాలా ఇన్ఫిరేష‌న్ జ‌ర్నీ... మీరు ఓ లుక్కేయండి

ఐఐటీ-ఖరగ్ పూర్ నుంచి ఏఈ లో పట్టా
చంద్రయాన్ -3 మిషన్ కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసిన కల్పనా కాళహస్తి కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఐఐటీ-ఖరగ్ పూర్ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో పట్టా పొందారు. మద్రాసు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో B.Tech చేశారు.

 

#Tags