Telangana CM Revanth Reddy Success Story : డైరెక్ట్ ఎమ్మెల్యే టూ..ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. సక్సెస్ జర్నీ ఇదే..
ఒక సాధారణ మండల నాయకుడిగా టీఆర్ఎస్‌లో మొదలైన రేవంత్ రెడ్డి ప్రస్థానం.. ఆ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి మారేలా చేసింది. ఆ తర్వాత చంద్రబాబుకు సన్నిహితుడిగా ఆయన మదిని దోచి.. ఆయనకు నమ్మినబంటుగా పార్టీలో ఎదిగేవరకూ వెళ్లింది. ఒకనాక దశలో టీడీపీ తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డికి వచ్చాయి. అనంతరం తెలుగుదేశం తెలంగాణలో అంతర్థానంతో రేవంత్ రెడ్డి పార్టీ మారాల్సి వచ్చింది. తనకు బద్ధ శత్రువైన కేసీఆర్ ను వ్యతిరేకించే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో చేరారు.
అందులో అధిష్టానం అభిమానం చూరగొని ఏకంగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ‘సీఎం’ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి సక్సెస్ జర్నీ మీకోసం.
కుటుంబ నేపథ్యం :
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లి, వంగూర్‌లో నవంబర్ 08, 1969న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు దివంగత అనుముల నర్సింహ రెడ్డి. తల్లి అనుముల రామచంద్రమ్మ. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను రేవంత్ రెడ్డి వివాహమాడారు.
చిన్ననాటి నుంచే..
మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు.
ఒక శూలశోధన ఆపరేషన్‌లో దొరికినందుకు గానూ..
ఆసక్తికర అంశాలు రెండు అసెంబ్లీ ఎన్నికలలో వేర్వేరు అఫిడవిట్ల కారణంగా రేవంత్ రెడ్డి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.3.6 కోట్లు గానూ, రూ.73 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. అయిదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.13.12 కోట్లు గానూ, అప్పులు రూ.3.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. అంటే కేవలం అయిదేళ్లలోనే ఆయన ఆస్తులు 4 రెట్ల వరకు పెరిగాయన్న మాట. ఒక శూలశోధన ఆపరేషన్‌లో దొరికినందుకు గానూ అవినీతి వ్యతిరేకం విభాగం పోలీసులు 2015 మేలో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.
బెయిలు షరతుల ప్రకారం ఏసీబీ అనుమతులు లేకుండా ఆయన హైదరాబాద్ నగరాన్ని దాటరాదు.
ఓ అరెస్టుతో..సంచలనం..
రాజకీయ కాలక్రమం 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్ నుంచి పోటీ చేశారు. 2018 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఆయన నియమితులయ్యారు. 2017 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015 ఒక శూలశోధన ఆపరేషన్‌లో దొరికిపోవటంతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు డబ్బులివ్వజూపారన్నది రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణ.
రాజకీయ ప్రస్థానం..
2014 కొడంగల్ నుంచి మరోమారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2008 రేవంత్ రెడ్డి టీడీపీలో మరోసారి చేరారు. 2008 శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006 జెడ్‌టీపీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2004 ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1992 విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో సభ్యుడయ్యారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచూస్తూ..
రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.
ఎమ్మెల్యే టూ.. డైరెక్ట్ ముఖ్యమంత్రిగా రికార్డు..?
ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు.రేవంత్ రెడ్డి ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి కాకుండానే.. కేవలం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీనావస్థ నుంచి..
ప్రత్యేక రాష్ట్రం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా..? అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో కొంతమందిని ప్రజలు గెలిపించారు. కానీ వారు ‘హ్యాండిచ్చి’ టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీలో ముఖ్య నాయకులు లేకుండా పోయారు. ఈ తరుణంలో ఉన్నవాళ్లు సైతం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ఆ పార్టీలో మనుగడ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ తరువాత ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కండువాపై గెలిచారు. మొదట్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికపై చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఆయన దూకుడుకు అధిష్టానం ఫిదా అయింది. దీంతోనే పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం 2021 జూన్ 26న టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అయితే మంచి రోజు చూసుకున్న ఆయన జూలై 7న బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే దూకుడు స్వభావమున్న రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మారిన తరువాత మరింత స్పీడ్ పెంచారు.
ఒక్కసారిగా..
ఏమాత్రం ఆలస్యం చేయకుండా దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో ‘గిరిజన దండోరా’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్‌లో గుబులు పుట్టించారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఈ సభలతో ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది.
కేసీఆర్ ఫాం హౌస్ వెళ్లేందుకు..
ఇక అంతటితో ఆగకుండా.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను పలు రకాలుగా నిరసనల ద్వారా తెలిపారు. ప్రజలను ప్రభుత్వం ఎలా వంచిస్తుందో చూడండి అంటూ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేయించారు. రైతులు దొడ్డు రకం ధాన్యం వేయవద్దని.. సన్నరకాలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు.. ఆయన ఫాం హౌస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు రేవంత్ ను మధ్యలోనే అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా తన చాకచక్యంతో సీఎం కేసీఆర్ కు సంబంధించిన పంట సాగు ఫొటోలను చిత్రీకరించి బయటపెట్టాడు. కేసీఆర్ తెలంగాణ రైతులను వరి వేయవద్దని తాను వేసిన మోసాన్ని బయటపెట్టారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో..
దుబ్బాకలో గెలిచి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ ఓ వైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి చేరుకుంది. అప్పటికీ రేవంత్ టీపీసీసీ చీఫ్ కాకున్నా.. ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోరాటాలు చేయించారు. ఇక కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ ను తెలంగాణకు రప్పించి వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభను పెట్టించారు. ఆ తరువాత కూడా రచ్చబండ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ నేతల చేత ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమాకం అయిన తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ దాటేస్తుందా..? అనే స్థితికి తీసుకొచ్చాడు.
ఒంటరిగా ముందుకు వెళ్లడం భావ్యం కాదని..
అయితే రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ యూత్ లో ఫుల్ జోష్ పెరిగింది. కానీ సీనియర్లలో మాత్రం ఇప్పటికీ అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఆయన చేస్తున్న కొన్ని పనులు తమకు నచ్చడం లేదని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యం చేశారని, అంతేకాకుండా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో సీనియర్ల మన్ననలు పొందినా ఆ తరువాత తన తీరుతో వారిలో అసంతృప్తి లేకుండా చేయలేకపోయారు. తమను కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం భావ్యం కాదని కొందరు సీనియర్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.
అసంతృప్తులను.. సంతృప్తులుగా..
ఇటీవల రేవంత్ రెడ్డి ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిని కాంగ్రెస్ లోకి వచ్చేట్లు చేశారు. అలాగే భూపాల పల్లిలోని ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించారు. హైదరాబాద్ లోని పీజేఆర్ కూతురు విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి రప్పించారు.
ఇటీవల ఓ మేయర్ కూడా కాంగ్రెస్ లోకి రావడం ప్లస్ పాయింట్ గా మారింది. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ లోని అసంతృప్తులు.. మాజీ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి రప్పించారు. ఈ ఊపు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ దూకుడు పనిచేస్తుందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు సీనియర్లు మాత్రం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతున్నారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ విజయంలో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా పనిచేసింది.