Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా

అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

జూన్ 26వ తేదీ లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్‌ కోసం పట్టుబట్టలేదు. 

దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. స్పీకర్‌ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాందీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్‌ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు.

బలరాం జాఖడ్‌ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్‌ స్థానానికి రాహుల్‌ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. 

Bhartrihari Mahatab : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌

#Tags