Arvind Kejriwal And His Family Details: జైలు జీవితాన్ని గడుపుతున్న అరవింద్‌ కేజ్రివాల్‌ ఏం చదువుకున్నారు? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరక ఉద్యమంలో పోరాడి, ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో కటకటాలపాలయ్యారు.

సామాన్యుడిలా ప్రజల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకొని, ముచ్చటగా మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు.  ప్రస్తుతం జైలులో ఉంటూనే ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద్‌ కేజ్రివాల్‌ చదువు, బ్యాక్‌గ్రౌండ్‌ వివరాలపై స్పెషల్‌ స్టోరీ. 


అరవింద్‌ కేజ్రివాల్‌.. హర్యానాలోని భివానీ జిల్లా సివానీ అనే మారుమూల గ్రామంలో 16 ఆగస్టు 1968న జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉండేవారు. 1985లో నిర్వహించిన ఐఐటీ జేఈఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 563వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలా మొదటి ప్రయత్నంలోనే ఐఐటి ఖరగ్‌పూర్‌లో ప్రవేశం పొందారు.

మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత టాటా స్టీల్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ సివిల్ సర్వీసెస్‌ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 1993 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌(IRS)లో చేరారు.

అనంతరం 1995లో తన IRS బ్యాచ్‌మేట్ అయిన సునీతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అబ్బాయి పుల్కిట్‌ కేజ్రివాల్‌ కాగా, అమ్మాయి పేరు హర్షిత కేజ్రివాల్‌. వీరిద్దరూ కూడా ఐఐటీయన్లే కావడం విశేషం. అంతేకాకుండా కేజ్రివాల్‌ లాగానే పిల్లలిద్దరూ చదువులో చురుగ్గా ఉండేవారు.

సిబిఎస్ఈ క్లాస్ 12 పరీక్షల్లో ఇద్దరూ 96 శాతానికి పైగా మార్కులు సాధించారు. అనంతరం ఇద్దరూ ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్‌ను పూర్తి చేసి తండ్రిలాగే ఐఐటీయన్స్‌ అనిపించుకున్నారు. 

#Tags