Russia Defence Minister: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
మాస్కో: రష్యా ప్రధాని వ్లాదిమర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణమంత్రి సెర్గీ షోయిగును తొలగించి ఆ స్థానంలో ఆండ్రీ బెలౌసోవ్ ను నియమించారు. పుతిన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం శనివారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్‌లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు.
రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు.
ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్‌ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది.