Women's Reservation Bill Latest News : ఎట్టకేలకు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్ట రూపం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర
ఈ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపంలోకి వచ్చింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్‌లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఇరు సభల్లోనూ ఆమోద ముద్ర పడింది.
రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో మహిళా బిల్లు చట్ట రూపం దాల్చింది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. దీనికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. ఇది 2029 కల్లా జరిగే అవకాశముంది.
ఏమిటీ బిల్లు ?
☛ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు.
☛ దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు.
☛ ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు.
బిల్లు హిస్టరీ ఇదే..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లుకి బీజం పడిందని చెప్పాలి. ఆయన ప్రవేశ పెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్‌లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. 1992, 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు రాజ్యాంగ సవరణ బిల్లు 72, 73లను తిరిగి ప్రవేశపెట్టారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వ్ చేశారు. బిల్లులు ఉభయ సభలు ఆమోదించాయి. చట్టంగా మారాయి. దీంతో దేశ వ్యాప్తంగా పంచాయితీలు, నగరాల్లో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఎంపికయ్యారు.
☛ Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కారణం..
ఈ బిల్లును తొలిసారిగా ఎప్పడూ ప్రవేశపెట్టారంటే..?
సెప్టెంబర్ 12, 1996 అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ కోసం 81వ రాజ్యంగా సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ఐతే లోక్‌సభలో ఆమోదం పొందలేకపోవడంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. డిసెంబర్ 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్‌సభ రద్దు కారణంగా బిల్లు రద్దయింది. ఇక రెండు సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1998లో 12వ లోక్‌సభలో ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది.ఈ సారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. పైగా రద్దైపోయింది.
వాజ్‌పేయి ప్రభుత్వంలో..
మళ్లీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999,2002, 2003లో తిరిగి ప్రవేశ పెట్టారు, కానీ విజయవంతం కాలేదు. ఐదేళ్ల తర్వాత మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కొంత పట్టు సాధించింది. 2004లో ప్రభుత్వం తన సాధారణ కార్యక్రమంలో ఈ బిల్లుని భాగస్వామ్యం చేసింది. చివరకు మే 6, 2008న రాజ్యసభలోకి ప్రవేశపెట్టింది. ఈసారి రద్దవ్వకుండా నిరోధించేలా 1996 గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులలో ఐదింటిని ఈ బిల్లు సంస్కరణలో చేర్చడం జరిగింది.
ఆ చట్టం మే 9, 2009న స్థాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. దీనికి ఫిబ్రవరి 2010లో కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోద ముద్ర పొందింది. చివరికి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది. మార్చి 9, 2010న 186-1 మోజార్టీ ఓట్లు పడ్డాయి. అయితే ఈ బిల్లు లోక్‌సభలో పరిశీలనకు తీసుకోలేదు. చివరికి 2014లో లోక్‌సభ రద్దుతో ముగిసిపోయింది. నిజానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన లేదా ఆమోదించన ఏ బిల్లు అంత తేలిగ్గా ముగియదు. అందువల్లే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా వీగిపోలేదు.
కొత్త పార్లమెంట్ భవనంలో..
ఇప్పుడూ కొత్త పార్లమెంట్ భవనంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావడం విశేషం. ఇక ప్రధాని సైతం ఈ చారిత్రత్మక నిర్ణయానికి దేవుడు తనను ఎంచుక్నున్నాడంటూ భావోద్వేగం చెందారు. ఈ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు కూడా పెట్టారు.
☛ GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవరు..?