Post-Study Visa: పోస్టు–స్టడీ వీసాలు రద్దు.. ఈ వీసా పథకం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా.?

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్‌ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు.

యూకేలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. 

యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. 

Student Visa Rules: ఇక్క‌డ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..

వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్‌ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్‌ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

#Tags