Nepal PM: నేపాల్ ప్రధానిగా.. ఓలి రెండేళ్లు, దేవ్‌బా ఒకటిన్నర సంవత్సరం!
దీని ప్రకారం కేపీ శర్మ ఓలి ప్రధానిగా రెండేళ్లు కొనసాగుతారు. ఆ తర్వాత మిగతా ఏడాదిన్నర కాలంలో నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ) చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా ప్రధానిగా పగ్గాలు చేపడతారు.
ఈ మేరకు తమ మధ్య కీలకమైన ఏడు అంశాలపై అంగీకారం కుదిరినట్లు నేపాల్– యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్(సీపీఎన్–యూఎంఎల్) చీఫ్, ప్రధాని ఓలి ఆదివారం పార్లమెంట్‌లో వెల్లడించారు. దీంతో, సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామ్యపక్షాలైన ఎన్‌సీ, సీపీఎన్–యూఎంఎల్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంపై వస్తున్న అనేక ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టినట్లయింది.
పార్లమెంట్‌లో బల నిరూపణలో విఫలమైన ప్రచండ స్థానంలో ఓలి ప్రధానిగా ఇటీవల ప్రమాణం చేశారు. దీంతో.. జూలై 21వ తేదీ ఓలి పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు పడ్డాయి. ఓలి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందినట్లు స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరే ప్రకటించారు.
KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా నాలుగోసారి నియమితులైన వ్యక్తి ఈయనే..