National Forest Martyrs Day: సెప్టెంబర్ 11వ తేదీ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం..
భారతదేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈ రోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబర్ 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది.
ఈ రోజుకు ఉన్న ప్రత్యేక కారణం ఇదే..
ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది.
September Important Days: సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే..
అప్పటి జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్‌లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.
అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు-మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు.